ప్రజలు “జగనన్న ఆరోగ్య సురక్ష” క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ.ఎస్. దినేష్ కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం వల్లూరు గ్రామంలో ఒకటవ సచి వాలయ పరిధిలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని ఆయన సందర్శించారు. శిబిరానికి వచ్చిన వారి వివరాల నమోదు, వారికి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రాలు, ఇక్కడ అందిస్తున్న వైద్య సేవలు, అందుబాటులో ఉన్న వైద్యులు, తదితర ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ …రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతోనే జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా వేల మందికి ఉచితంగా వైద్య సేవలు అందుతున్నాయన్నారు. ఈ క్యాంపులలో నిపుణులైన వైద్యులతో ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. కంటి వెలుగు క్రింద కూడా పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రజల అవసరాలకు తగినట్లుగా స్థానికంగానే సచివాలయ పరిధిలో ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రజలకు అవసరమైన అన్ని పరీక్షలు ఉచితంగా నిర్వహించి, అవసరమైన మందులను కూడా ఉచితంగానే ఇస్తున్నట్లు చెప్పారు. ప్రజల అనారోగ్య పరిస్థితిని బట్టి అవసరమైన వారిని జి.జి.హెచ్, వై.ఎస్.ఆర్. ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులకు పంపిస్తున్నామన్నారు. ఎక్కువ శాతం బి.పి., షుగర్ రోగులు వస్తున్నారన్నారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పౌష్టికాహార లోపం ఉన్న పిల్లలు కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకునేలా వాలంటీర్లు, ఎ.ఎన్.ఎం.లు, ఆశాలు, అవగాహన కల్పించాలన్నారు.
ఈ సందర్భంగా ఆయన వెంట ట్రైనీ కలెక్టర్ శౌర్యమన్ పటేల్, డి.ఎం. హెచ్.ఓ. రాజ్యలక్ష్మి, ఎం.పి.డి.ఓ. వనజాక్షి, తహశీల్దార్ సంజీవరావు, స్థానిక వైద్యులు, వివిధ శాఖల మండల అధికారులు పాల్గొన్నారు.
అంతకుముందు వల్లూరు లోని స్థానిక వల్లూరమ్మ దేవాలయంలో ట్రైనీ కలెక్టర్ శౌర్యమన్ పటేల్ తో కలిసి కలెక్టర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈ.ఓ., పురోహితులు, ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ కు తీర్ధ ప్రసాదాలు అందించారు.


