ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన పంటలకు ఇన్సూరెన్స్ అందాలంటే ప్రతి రైతు తప్పనిసరిగా ఈ క్రాప్ నమోదు చేసుకోవాలని వ్యవ సాయశాఖ ఒంగోలు సబ్ డివిజన్ ఏడీఏ రమేష్ బాబు సూచించారు. నాగులుప్పలపాడు మండలంలోని చేకూరపాడు గ్రామంలో రైతు ఉత్పత్తిదారులు సంఘ సభ్యులు, రైతులకు బుధవారం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ప్రభుత్వ పథ కాల వివరాలు తెలియజేశారు. ఏవో వెంకట్రావు మాట్లాడుతూ…. ఈ నెలాఖరు నుంచి రైతులకు 40 శాతం రాయితీపై శనగ విత్తనాలను గతంలో కంటే ఎక్కువగా 40 కిలోల వరకు రైతులకు అందజేయనున్నట్లు తెలిపారు. జేజే-11 రకం సబ్సిడీపోగా రూ.48.60కు, కాక్-2 రకం సబ్సిడీపోను కిలో రూ.84.30కు అందజేయనున్నట్లు తెలిపారు. అలాగే రైతులకు కావాల్సిన అన్ని రకాల ఎరువులు రైతు భరోసా కేంద్రాల వద్ద అందుబాటులో ఉన్నాయని, ఆర్బీకేల ద్వారా రైతులు పొందవచ్చని చెప్పారు. ముందుగా సాగులో ఉన్న కంది మినుము పొగాకు పంటలను పరిశీలించి సస్యరక్షణ చర్యల గురించి వివరించారు .కార్యక్రమంలో జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయాధికారి శేషమ్మ, వ్యవసాయ అధికారి వెంకట్రావు ,గ్రామ సర్పంచ్ రమేష్, రైతులు పాల్గొన్నారు.



