రైతులు పండిస్తున్న పంటల సాగులో వృధా ఖర్చులను తగ్గించి ఆదాయం పెంచేందుకు జిల్లా వనరుల కేంద్రం ఆధ్వర్యంలో రైతులకు క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పిస్తున్నట్లు డిఆర్సీ వ్యవసాయాధికారులు శైలజా రాణి, శేషమ్మలు తెలిపారు. చీమకుర్తి మండలం పి. నాయుడు పాలెం గ్రామాన్ని పైలెట్ గ్రామంగా ఎంపిక కావటంతో గురువారం పాటిమీద పాలెం గ్రామ రైతు చీదర్ల కోటయ్య పొలంలో వరి పొలంను పరిశీలించారు. సాగులో పాటిస్తున్న పద్ధతులను రైతు నుండి తెలుసుకుని ఖర్చు తగ్గించుకుని దిగుబడి పెంచుకునేందుకు అవసరమైన పలు విధానాలను తెలిపారు. ఎంటీయూ 1156 రకం నారుమడిలో రైతులకు గుళికలు వేసే పద్ధతి లేక పోవటంతో ఉల్లికోడు తెగుళ్లు ఆశించే అవకాశం ఉన్నందున సెంటు నారుమడిగి 160 గ్రాముల కార్బోప్యూరాన్ 3 జి గుళికలు వేయించారు. అదేవిధంగా జొన్న పంట వేసిన పొలంలో సింగిల్ సూపర్ ఫాస్పేట్ వేసి తొక్కించటం వలన బాగా చివికి పంటకు మంచి సేంద్రీయ ఎరువు తయారు అవుతుందని చెప్పారు. గతంలో పాటించిన పద్ధతులు రైతులు పొలం బడి ద్వారా తెలిసికొని మంచి దిగుబడులు పొందుతారని చెప్పారు. విఏఏ శృతి తదితరులు పాల్గొన్నారు.


