మంచు కురుస్తున్న వేళలో… శ్రీగిరి గిరి ప్రదక్షిణ.ఆహ్లాదకర వాతావరణంలో ఆధ్యాత్మిక శోభాయాత్ర

శ్రీనివాసుని నామస్మరణ ఒకవైపు, చల్లని వాతావరణం ఒకవైపు, కురుస్తున్న మంచు తెరల మధ్య మంద్రంగా గోవిందనామాలు, శ్రీవేంకటేశ్వరుని సుప్రభాతం చదువుకుంటూ వందలాది మంది భక్తులు శ్రీగిరి గిరిప్రదక్షిణ చేసి శ్రీగిరి పై కొలువైయున్న శ్రీనివాసుని దర్శించుకున్నారు.
శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి మాసంలో స్వామి వారి జన్మనక్షత్రం శ్రవణా నక్షత్రం రోజున నిర్వహిస్తున్న శ్రీగిరి గిరి ప్రదక్షిణ కార్యక్రమం భక్తులలో ఆధ్యాత్మిక భావాలను ద్విగుణీకృతం చేసింది. శనివారం ఉదయం 5 గంటల నుండి స్థానిక శ్రీ బాపూజీ గోసంరక్షణ సంఘం నుండి శ్రీగిరి గిరి ప్రదక్షణకు బయలుదేరిన భక్తులు గ్రంథాలయం, కేశవ స్వామి పేట ఆలయములు, భగీరథ సర్కిల్ మీదుగా శర్మ కాలేజ్ క్రికెట్ గ్రౌండ్, గద్దలగుంట శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి, లక్ష్మీగణపతి ఆలయముల ముందుగా శ్రీగిరి చేరి శ్రీనివాసుని దర్శించి భక్తిపారవశ్యములో పులకితులైనారు.
ఈ సందర్భంగా శ్రీ గిరి గిరి ప్రదక్షిణ కమిటీ అధ్యక్షులు రాధా రమణ గుప్తా జంధ్యం మాట్లాడుతూ శ్రావణమాసంలో ప్రారంభించిన శ్రీగిరి గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఆరు నెలలు పూర్తి చేసుకున్నదని, ఈ ఆరు నెలల కాలం ఆరు క్షణాలుగా గడిచిపోయిందని పేర్కొన్నారు. శ్రీగిరి గిరి ప్రదక్షిణ కార్యక్రమం సమాజంలో ఆధ్యాత్మిక భావనలను పెంచడానికి, ప్రజల మధ్య సఖ్యత సమభావం పెంపొందడానికి, ఆరోగ్యం బలీయమవడానికి ఉపయుక్తమైనదని, స్వామివారి అనుగ్రహంతోనే ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నదని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న శ్రీవారి భక్తులందరూ కమిటీ వారి ఆలోచనలకు అనుగుణంగా పూర్తి సహకారం అందిస్తూ, స్వామివారి నామస్మరణ చేసుకుంటూ… గిరి ప్రదక్షిణ చేయడం జరుగుతున్నదని తెలిపారు.
కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు. ఒంగోలు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు శ్రీగిరి గిరి ప్రదక్షిణ కు రావడం చాలా ఉత్సాహాన్ని ఇచ్చిందని తెలిపారు.
శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ అధ్యక్షులు రాధా రమణ గుప్తా జంధ్యం, ఉపాధ్యక్షులు తూనుగుంట మల్లికార్జున్ రావు, సహకార్యదర్శి నేరెళ్ల శ్రీనివాసరావు, కార్యవర్గ సభ్యులు పబ్బిశెట్టి శ్రీనివాసరావు, కోటి సూర్యనారాయణ, ధనిశెట్టి రామునాయుడు మరియు శ్రీవారి భక్తులు తదితరులు కార్య నిర్వహణ చేశారు. మార్గమధ్యలో భగీరథ సర్కిల్ వద్ద సగర పుత్రులు గిరి ప్రదక్షిణ చేస్తున్న భక్తులకు పాల ప్రసాదం అందించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *