సాటి వారికి అవసరమైన సహాయాన్ని అందించినప్పుడే మానవ జీవితానికి సార్ధకత ఏర్పడుతుందని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం సనత్ నగర్ లోని బీ కే గూడ పార్క్ వద్ద శ్రీనివాస సమాజ సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 50 రోజులుగా నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం ముగింపు సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆకలితో అలమటిస్తున్న వారి ఆకలిని తీర్చాలనే సంకల్పంతోనే 2011 సంవత్సరం నుండి సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో పలువురు దాతల సహకారంతో నిర్వహిస్తూ వస్తున్నారని తెలిపారు. ఏప్రిల్ 10 వ తేదీన ప్రారంభించిన అన్నదాన కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు సుమారు 300 మంది ఆకలిని తీర్చడం ఎంతో గొప్ప విషయం అన్నారు. తమ వయసును సైతం లెక్కపెట్టకుండా సమాజంలోని పేదలకు మేలు చేయాలనే ఉద్దేశంతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సీనియర్ సిటిజన్స్ ను అభినందించారు. మనం చేసే సేవా కార్యక్రమాలు సమాజంలో ఒక ప్రత్యేక గౌరవాన్ని, గుర్తింపు ను తీసుకోస్తాయని చెప్పారు. సనత్ నగర్ సీనియర్ సిటిజన్స్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు అనేకమందికి స్పూర్తిగా నిలుస్తాయని అన్నారు. సీనియర్ సిటిజన్స్ నిర్వహించే సేవా కార్యక్రమాలకు ఇప్పటి వరకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ వచ్చానని, ఇకముందు కూడా అదేవిధంగా అందిస్తానని ప్రకటించారు. అనంతరం నిర్వహకులు, దాతలను ఆయన ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, సనత్ నగర్ డివిజన్ బీ ఆర్ ఎస్ అద్యక్షులు కొలన్ బాల్ రెడ్డి, శ్రీనివాస సమాజ సేవా చారిటబుల్ మేనేజింగ్ ట్రస్టీ పార్ధసారధి, కృష్ణారెడ్డి, సీనియర్ సిటిజన్స్ అద్యక్షులు మాణిక్ రావ్ ఠాగూర్, సహదేవ్ గౌడ్, ఆర్ సి కుమార్, నాయకులు అశోక్ యాదవ్, ప్రవీణ్ రెడ్డి, సురేష్ గౌడ్, భద్రయ్య, నర్సింహ, పాటిల్ ప్రసాద్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


