రైళ్ల భద్రత ,సమయ పాలనపై దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ మంగళ వారం సమీక్ష నిర్వహించారు.
రైళ్ల కార్యకలాపాల నిర్వహణలో భద్రత మరియు సమయపాలనపై సమీక్ష నిర్వహించిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ భద్రత మరియు సమయపాలనపై తీసుకోవలసిన చర్యలపై వివిధ శాఖలకు చెందిన ప్రధానాధిపతులతో కలసి సమీక్షా సమావేశాన్ని మంగళ వారం సికింద్రాబాద్ లోని రైల్ నిలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు జనరల్ మేనేజర్ ఆర్. ధనంజయులు తోపాటు మొత్తం 6 డివిజన్లు సికింద్రాబాద్ , హైదరాబాద్ , విజయవాడ , గుంతకల్లు , గుంటూరు మరియు, నాందేడ్ డివిజనల్ రైల్వేమేనేజర్లు (డి. ఆర్. ఏంలు ) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు
అరుణ్ కుమార్ జైన్ జోన్‌లో రైలు రాకపోకల భద్రతపై సమీక్షించారు. రైళ్లను సురక్షితంగా నడిపేందుకు భద్రతకు సంబందించిన విధివిధానాలను కచ్చితంగా పాటించాలని ఆయన అధికారులను ఆదేశించారు. లోకో పైలట్లు, అసిస్టెంట్ లోకో పైలట్లు, స్టేషన్ మాస్టర్లు , పర్మినెంట్ వే మెయింటెనెన్స్ సిబ్బంది మరియు రన్నింగ్ సిబ్బందిని క్రమం తప్పకుండా భద్రతపై కౌన్సిల్ నిర్వహించాలని ఆయన సూచించారు. ఇంజినీరింగ్, మెకానికల్ మరియు సిగ్నలింగ్ పరికరాలు మొదలైన భద్రతా వస్తువుల లభ్యతపై సమీక్ష నిర్వహించారు.
తదనతరం మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైలు సమయపాలనపై చర్చను కొనసాగిస్తూ, సమయపాలనను మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. కొన్ని ప్రాంతాల్లో రైళ్ల జాప్యానికి గల కారణాలను గుర్తించి వాటిని సరిదిద్దేందుకు లోతుగా విశ్లేషణ చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. వేగ నియంత్రణల విధింపుపై సమీక్షించిన ఆయన రైళ్ల సగటు వేగాన్ని పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
అరుణ్ కుమార్ జైన్ సిబ్బంది పని వేళలపై చర్చిస్తూ భద్రతకు సంబందించిన సిబ్బందికి సమాయనుసారం విశ్రాంతిని ఖచ్చితంగా ఇచ్చేందుకు ప్రణాళిక చేయాలని డివిజనల్ రైల్వే మేనేజర్లందరికీ సూచించారు.

