సామాజిక భద్రత, భరోసా లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని, సెప్టెంబర్ 1న ఆదివారం సెలవు దినం కావడంతో ఒక రోజు ముందుగానే ఈ రోజు ఎన్టీఆర్ భరోసా లబ్ధిదారులకు పెన్షన్లు అందిస్తున్నామని రాష్ట్రా సాంఘిక సంక్షేమ శాఖ, విభిన్న ప్రతిభావంతులు మరియు వయో వృద్దుల సంక్షేమ శాఖ, సచివాలయం మరియు గ్రామ వాలంటీర్ శాఖ మంత్రివర్యులు డా. డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు.
శనివారం ఉదయం యర్రగొండపాలెం నియోజక వర్గం, పెద్దారవీడు మండలం, దేవరాజుగట్టు గ్రామంలో జోరుగా వర్షం కురుస్తున్నా పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా పథకం లబ్దిదారులకు మంత్రివర్యులు డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, యర్రగొండపాలెం నియోజక వర్గ ఇన్చార్జి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు తో కలసి ఫించన్ నగదును పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఎన్నికల మ్యానిఫెస్టులో ఇచ్చిన వాగ్దానం మేరకు ఇంతకుముందు 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ ని 4,000 రూపాయలకు పెంచడం, మూడు నెలల బకాయిలు కలిపి మొత్తం 7,000 రూపాయల పెన్షన్ జులై మాసంలోనే ఇవ్వడం జరిగిందన్నారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు ఇస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంతో, అభివృద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. సెప్టెంబర్ 1న ఆదివారం సెలవు దినం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ఒక రోజు ముందుగానే పెన్షన్లు ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. గతంలో 200 రూపాయలు ఉన్న పెన్షన్ ను వెయ్యి రూపాయలకు పెంచామని, అనంతరం 2 వేల రూపాయలు చేశామన్నారు. గత ప్రభుత్వం పెన్షన్ ను 2 వేల రూపాయల నుండి 3 వేల రూపాయలు చేసేందుకు 5 సంవత్సరాల సమయం తీసుకుందని, తమ ప్రభుత్వం 3 వేల రూపాయల పెన్షన్ ను 15 రోజులలో 4 వేల రూపాయలకు పెంచి,ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు మార్చి ,ఏప్రిల్, మే నెలలకు సంబంధించి మూడునెలల పెంచిన పెన్షన్ 3 వేల రూపాయలతో కలిపి 7 వేల రూపాయలను జులై,1వ తేదీనే అందించడం జరిగిందన్నారు. విభిన్న ప్రతిభావంతులకు 3 వేల నుండి 6 వేల రూపాయలకు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి 5 వేల నుండి 10 వేల రూపాయలకు, పక్షవాతం వంటి వ్యాధులతో బాధపడుతూ మంచం మీద నుండి లేవలేని పరిస్థితిలో ఉన్నవారికి 5 వేల నుండి 15 వేల రూపాయలకు పెన్షన్ పెంచడం జరిగిందన్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందిస్తామని మంత్రి చెప్పారు. ఉచిత ఇసుక విధానాన్ని తీసుకురావడమైనదన్నారు. నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణా కార్యక్రమాలను అమలుచేస్తూ ఉద్యోగావకాశాలు మెరుగుపడేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ఉమ్మడి రాష్ట్రాల ప్రాజెక్టు తుంగభద్ర గేటు కొట్టుకు పోతే ముఖ్యమంత్రి గారు ప్రత్యేక కొరవ తీసుకొని నీరు వృధాగా పోకుండా గేట్లు అమర్చేలా చర్యలు తీసుకోవడంతో పాటు రైతుల ప్రయోజనాల కోసం పాటు పడుతున్న వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారని మంత్రి అన్నారు. విధానాలు సమీక్షించుకుని సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్నట్లు మంత్రి అన్నారు. రాష్ట్రంలోని అన్నీ సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. జిల్లాలో మొత్తం 2 లక్షల 91 వేల 534 మందికి ఈ రోజు 199 కోట్ల రూపాయలు పింఛన్ కింద ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. యర్రగొండపాలెం నియోజక వర్గంలో 36,581 మందికి 25 కోట్ల రూపాయలు ఎన్టీఆర్ భరోసా పధకం కింద పింఛన్లు అందచేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు, మండల స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
