ఖరీఫ్ సాగు చేసిన మొక్కజొన్నలో దిగుబడులు తగ్గి అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. రైతుల ఫిర్యాదు మేరకు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించి మొక్కజొన్న దిగుబడులు తగ్గే అవకాశం ఉందని పరిశీలించాలని కోరగా గుంటూరు లాం ఫారం నుంచి ఆచార్య ఎన్ జి రంగా విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు మంగళవారం కొర్రపాటి వారి పాలెం, కొత్త పాలెం, మాధవరం పొలాలను పరిశీలించారు. భారతి 756 రకం ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసారు. గత రెండేళ్లుగా 25 నుండి 30 క్వింటాళ్లు పైగా దిగుబడులు వచ్చాయి. అయితే ఈ సంవత్సరం దిగుబడులు ఆశించిన మేర వచ్చే అవకాశం లేక పోవటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో శాస్త్రవెత్తలు డాక్టర్ సివిసి ఎం రెడ్డి, డాక్టర్ డయానా లు పరిశీలించి… భారతి 756 రకంలో ప్రస్తుతం 90 నుండి వంద రోజుల కాల వ్యవధి పంట ఉందని అన్నారు. కండెలు 60శాతం చిన్న పరిరమాణంలోను, కేవలం 40శాతం మాత్రమే సాధారణ పరిమాణంలోను ఉన్నాయని తెలిపారు. వీటితో పాటు ఆడ్వాంటా హైబ్రిడ్ 751, శ్రీరామ సీడ్స్ వేసిన పొలాలను పరిశీలించారు. వీటిలో కండె పరిమాణం లో వ్యత్యాసం తక్కువగా ఉందని గుర్తించారు. గతంలో మిరప వేసిన పొలాల్లో కండెలు బాగా ఉన్నట్లు చెప్పారు. తదనంతరం రైతులతో చర్చించి పాటిస్తున్న సాగు పద్దతులను ఇతర వివరాలను సేకరించారు. పూర్తిగా అధ్యయనం చేసి నివేదికను జిల్లా వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులకు సమర్పించనున్నట్లు చెప్పారు. వ్యవసాయాధికారి ప్రసాద రావు, విఏఏలు నాగరాజు నాయక్, వెంకట రావు, అశోక్, సుధీర్ లు పాల్గొన్నారు.

