బాల్య వివాహాల నివారణపై జిల్లా యంత్రాంగం “బంగారు బాల్యం” పేరుతో ప్రత్యేక దృష్టి – జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా

జిల్లాలో 12-18 ఏళ్ల బాలికల వివరాలను పకడ్బందీగా సేకరించాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. బాల్య వివాహాల నివారణపై జిల్లా యంత్రాంగం “బంగారు బాల్యం” పేరుతో ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. శనివారం ఆయా అంశాలపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో ప్రకాశం భవనంలో ఆమె ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. 3 – 6 ఏళ్ల చిన్నారులు ఎంత మంది ఉన్నారు? వారిలో ఎంతమంది అంగన్వాడీలలో ఉన్నారు? పాఠశాల వయస్సు పిల్లలు ఎంత మంది ఉన్నారు? వారిలో ఎంతమంది పాఠశాలలో ఉన్నారు? విద్యార్థులకు వ్యాక్సిన్ వేస్తున్న తీరు, రక్తహీనత, తదితర అంశాలపై ఆమె సమీక్షించారు. బాల కార్మికులుగా పనిచేసి, విముక్తి పొందిన పిల్లలప్రస్తుత స్థితిగతులపై కలెక్టర్ఆరా తీశారు. బాల్యం ప్రతి చిన్నారికి సంతోషమయంగా ఉండేలా జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టినందున పాఠశాలల నుండి డ్రాపౌట్స్ లేకుండా, పోషకాహార లోపం లేకుండా, బాల్య వివాహాలు జరుగకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. వీటికి సంబంధించిన డేటా పకడ్పందీగా నిర్వహించాలని ఆమె పునరుద్ఘాటించారు. తల్లిదండ్రులు లేకుండా బంధువుల వద్ద ఆశ్రయం పొందుతున్న ఆడపిల్లల స్థితిగతులపైన ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ సమావేశంలో ఐ.సి.డి.ఎస్.పి.డి. మాధురి, ఆర్.బి.ఎ.స్.కె. నోడల్ ఆఫీసర్ భగీరధీ, కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్ గాయత్రీదేవి, జిల్లా ఇమ్యునైజేషన్ ఆఫీసర్ పద్మజ, జిల్లా బి.సి. సంక్షేమ అధికారి అంజల, గిరిజన సంక్షేమ అధికారి జగన్నాధరావు, డి.సి.పి.ఓ. దినేష్ కుమార్ జిల్లా ఉప విద్యాధికారి సామా సుబ్బారావు, డి.ఎల్.పి.ఓ. పద్మ, సి.డి.పి.ఓ.లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *