ట్రాఫిక్ క్రమబద్ధీకరించి దర్శి పట్టణ ప్రజల సుఖ ప్రయా ణానికి పోలీస్ శాఖ తగిన చర్యలు తీసుకుంటుందని టీడీపీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి హర్షం వ్యక్తం చేశారు. గడియార స్తంభం సెంటర్లో శనివారం ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన అవసరమని, భద్రత ఆవశ్యకతను వివరించారు . ప్రజల భద్రత కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రతిష్టాత్మకంగా ఇటీవల చేపట్టిన డ్రోన్ సమ్మిట్ ఫలాలు దర్శి వరకు చేరాయని ఆనంద వ్యక్తం చేశారు.
పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, అసాంఘిక శక్తులు చెలరేగకుండా పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రోన్ కెమెరాను అందించినట్టు వెల్లడించారు. అంతే కాకుండా ప్రతి గ్రామంలో ప్రజల భద్రత దృష్ట్యా దొంగతనాలు, దోపిడీలు, దౌర్జన్యాలు దాడులను నివారించే లక్ష్యంతో నియోజక వర్గంలో 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక తో ముందుకు వెళుతున్నామని లక్ష్మి వివరించారు. ఎస్పీ దామోదర్ ప్రత్యేకంగా ఆమె ధన్యవాదాలు తెలిపారు. నానాటికి పెరుగు తున్న జనాభా రీత్యా దర్శి పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు మేము కోరిన వెంటనే ట్రాఫిక్ ఎస్పై ని ప్రత్యేకంగా నియమించారని తెలిపారు. పోలీస్ శాఖ కూడా ట్రాఫిక్ నిబంధనల పేరుతో టూ వీలర్, ఫోర్ వీలర్ వాహనదారులను కేసులతో ఇబ్బంది పెట్టవద్దని ప్రజల్లో చైతన్యం కలిగించి మార్పు తేవాలని డాక్టర్ లక్ష్మి సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ రామారావు, ఎస్ఐ మురళి, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, తదితరులు ఉన్నారు.
