బాలల హక్కుల పరిరక్షణకు సంబంధిత చట్టాలపై అధికారులందరికీ సమగ్ర అవగాహన అవసరమని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా చెప్పారు. జిల్లాలో ప్రత్యేకంగా “బంగారు బాల్యం” కార్యక్రమాన్ని అమలు చేస్తున్నందున బాలలకు సంబంధించిన చట్టాలపై జిల్లా స్థాయి అధికారులకు గురువారం ప్రకాశం భవనంలోని గ్రీవెన్స్ హాలులో ప్రత్యేక అవగాహనా కార్యక్రమాన్ని ఆమె ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ …బాలల హక్కులు, వారి రక్షణకు ఉన్న చట్టాలు, ప్రభుత్వ పధకాలు, వాటిని పొందేందుకు కావాల్సిన అర్హతలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాల్సి ఉందన్నారు. ఇందులో భాగంగానే తొలుత అధికార యంత్రాంగానికి ఈ ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె వివరించారు. న్యాయ, కార్మిక, గర్భస్థ పిండ లింగ నిర్థారణ పరీక్షా చట్టం, పోక్సో, విద్యా హక్కు చట్టాలపై ఆయా శాఖల ఉన్నతాధికారులు, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ జి.రవిశంకర్, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పి.వి.రాఘవులు వివరించారు.
ఈ కార్యక్రమంలో డి.ఆర్.ఓ. బి.చిన ఓబులేసు, ఐ.సి.డి.ఎస్. పి.డి. మాధురి, జిల్లా ఉప విద్యాధికారి సామా సుబ్బారావు, కనిగిరి ఆర్.డి.ఓ. కేశవర్థన్ రెడ్డి, ఒంగోలు ఆర్.డి.ఓ. లక్ష్మీ ప్రసన్న, సార్డ్స్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ఆర్. సునీల్ కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


