ఆహ్లాదకరమైన వాతావరణంలో పెరిగి తమ కలలను సాకారం చేసుకునే స్వేచ్ఛను ప్రతి బిడ్డకూ కల్పించాల్సిన బాధ్యత సమాజంలోని అన్ని వర్గాల ప్రజలపైనా ఉంది – జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా

ఆహ్లాదకరమైన వాతావరణంలో పెరిగి తమ కలలను సాకారం చేసుకునే స్వేచ్ఛను ప్రతి బిడ్డకూ కల్పించాల్సిన బాధ్యత సమాజంలోని అన్ని వర్గాల ప్రజలపైనా ఉందని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా అన్నారు. జాతీయ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని తన మానసపుత్రిక అయిన “బంగారు బాల్యం” కార్యక్రమంలో భాగంగా వారం రోజులపాటు జిల్లావ్యాప్తంగా నిర్వహించే “బంగారు బాలోత్సవాల”ను గురువారం ప్రకాశం భవనంలో ఆమె ప్రారంభించారు.
ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.శ్యామ్ బాబు, బాలల సంక్షేమ కమిటీ చైర్ పర్సన్ వి. రామాంజనేయులు, డి.ఆర్.ఓ. బి. చినఓబులేసు, ఐ.సి.డి.ఎస్. పి.డి. మాధురిలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. బాలల స్వేచ్ఛకు ప్రతీకగా చిన్నారులచేత బెలూన్లను వీరు గాలిలోకి ఎగురవేయించారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా, బాలల హక్కుల పరిరక్షణ కోసం తమవంతు బాధ్యత నిర్వహిస్తామని ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారితో కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…. బాల కార్మికులు లేని, బాల్య వివాహ రహిత, అక్షర చైతన్య, ఆరోగ్య ప్రదమైన ప్రకాశం జిల్లా ఆవిష్కరణే లక్ష్యంగా దృష్టి పెట్టినట్లు చెప్పారు. ఇందులో భాగంగా 18 ఏళ్లలోపు బాలలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి “బంగారు బాల్యం” కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. సంతోష, ఆరోగ్య, సురక్షితమైన బాల్యాన్ని వారికి అందించడం కోసం వివిధ శాఖల అధికారులతో గ్రామ, మండల, డివిజన్, జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీలను నియమించామని చెప్పారు. సంతోషకరమైన బాల్యానికి దూరమయ్యే బాలలను గుర్తించి వారికి మంచి భవిష్యత్తు కల్పించేలా ప్రతి బిడ్డ కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తామని స్పష్టం చేశారు. ఈ దిశగా అంగన్వాడీలు, పాఠశాలల్లో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పిస్తున్నామన్నారు. బాలలకు సంబంధించిన అన్ని పధకాలను సమన్వయం చేస్తూ మెరుగైన ప్రయోజనాలను అందించేలా జిల్లా యంత్రాంగం చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి బాలలను తమ స్వంత బిడ్డలుగా భావించి సమాజంలోని అన్ని వర్గాల వారు తమ వంతు బాధ్యత నిర్వహించాలని కలెక్టర్ కోరారు. బాల్య వివాహాలుచేసుకోబోమని, తమ దృష్టికి వచ్చిన వాటిని జరుగనివ్వబోమని ప్రతి ఒక్కరూ సంకల్పం పూనాలని ఆమె పిలుపునిచ్చారు.

మూడో తరగతి నుండే ఐ.ఏ.ఎస్….. లక్ష్యంగా

భవిష్యత్తులో ఏస్థాయిలో ఉండాలో చిన్నప్పుడే బాలల్లో ఆశ కలిగించి అందుకు అవసరమైన సహాయం అందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనా, టీచర్ల పైనా ఉందని కలెక్టర్ చెప్పారు. తాను మూడో తరగతిలో ఉన్నప్పుడు తమ పాఠశాలలో జరిగిన చిల్డ్రన్స్ డే వేడుకలలో “పెద్దయ్యాక ఏమవుతావు?” అని విద్యార్థులందిరినీ టీచర్లు అడిగినప్పుడు “ఐ.ఏ.ఎస్. అవుతాను” అని తాను సమాధానం చెప్పినట్లు కలెక్టర్ చెప్పారు. అప్పటి నుంచే ఆ దిశగా ఆలోచించడం ప్రారంభించినట్లు ఆమె తెలిపారు. తన తల్లిదండ్రులు, టీచర్లు సహకారం అందించి వెన్నుదన్నుగా నిలిచినట్లు చెప్పారు. సంకల్పబలంతో దేనినైనా సాధించవచ్చని అన్నారు. ప్రతి బిడ్డకీ ఈ విధమైన మద్దతు, సహాయ సహకారాలు మనందరమూ అందించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ ..ప్రతి ఆడబిడ్డను కనీసం 18 ఏళ్లు పూర్తయ్యేవరకైనా చదివించాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. కేవలం జీవించడం మాత్రమే కాదని, బాలలు గౌరవప్రదంగా జీవించే హక్కును కూడా మనందరం నెరవేర్చాల్సి ఉంటుందని అన్నారు. బాల కార్మికులుగా మారకుండా, బాల్య వివాహాలు చేయకుండా ప్రతి బిడ్డనూ మన బిడ్డే అనే ధోరణితో చూసుకోవాలని అన్నారు.

శ్యాంబాబు మాట్లాడుతూ బాలల హక్కుల కోసం ఉన్న చట్టాలపై సమాజంలోని అన్ని వర్గాలు అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఈ దిశగా న్యాయసేవాధికార సంస్థ అందిస్తున్న సేవలను ఆయన వివరించారు. జిల్లావ్యాప్తంగా వివిధ కోర్టులలో ఉన్న ప్యానల్ అడ్వొకేట్స్, పారా లీగల్ వాలంటీర్ల సేవలను కూడా వినియోగించుకోవచ్చని చెప్పారు. ఏదైనా సహాయం అవసరమైతే 15100 టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేయవచ్చని అన్నారు.

సి.డబ్ల్యు.సి. చైర్పర్సన్ మాట్లాడుతూ బాల్యం బంగారుమయం అయ్యేలా, బాలలు సర్వతోముఖాభివృద్ధి సాధించేలా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. డి.ఆర్.ఓ. మాట్లాడుతూ బాలల సంక్షేమం కోసం వివిధ ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు మరింత సమన్వయంతో పనిచేయాలని అన్నారు.బంగారు బాల్యం కార్యక్రమానికి సంబంధించి జిల్లావ్యాప్తంగా అవగాహన కల్పించే | పోస్టర్లను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. బాల కార్మికులుగా ఉన్న తాము విముక్తిపొంది చదువుకుంటూ రాష్ట్ర స్థాయిలో వివిధ పోటీలలో చూపిన ప్రతిభను విద్యార్థులు సందర్భంగా వివరించగా, వారిని కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో బంగారు బాల్యం నోడల్ ఆఫీసర్ ఎం.వెంకటేశ్వరరావు, డి.ఈ.ఓ. కిరణ్ కుమార్ డిప్యూటీ డి.ఈ.ఓ. సామా సుబ్బారావు, జడ్పీ సి.ఈ.ఓ. చిరంజీవి, డి.ఎం.హెచ్.ఓ. సురేష్ కుమార్, ఆర్.ఐ.ఓ. సైమన్ విక్టర్, డి.ఆర్.డి.ఏ. పి.డి. వసుంధర, మెప్మా పి.డి. రవికుమార్, బి.సి. సంక్షేమ అధికారి అంజల, మైనార్టీ సంక్షేమ అధికారి నారాయణ, దివ్యాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు అర్చన, డి.సి.పి.ఓ. దినేష్ కుమార్, సార్డ్స్, రిలయన్స్ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సునీల్ కుమార్, బాబూరావు, దళిత బహుజన రీసోర్స్ సెంటర్ తరఫున కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *