బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం స్థానికి బండ్ల మిట్ట లో గల బాలికల ఉన్నత పాఠశాలో జరిగిన బాలల ఉత్సవంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…ప్రకాశం జిల్లా లో 0 నుండి 18 వయస్సు గల పిల్లలందరూ ముఖ్యంగా బాలికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో మెరుగైన మౌలిక సదుపాయాలతో ఆరోగ్యంగా చక్కగా చదువుకునేలా జిల్లాలో బంగారు బాల్యం కార్యక్రమాన్ని చేపట్టి ఈ రోజు నుండి వారం రోజుల పాటు బంగారు బాలోత్సవాలు జిల్లా వ్యాప్తంగా జరుపుకోనున్నట్లు తెలిపారు. ప్రతి విద్యార్ధి విద్యార్ధి దశ నుండే ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించడానికి కలలను సాకారం చేసుకోవడానికి కష్టపడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అనేక కార్యక్రమాలను, పధకాలను అమలు చేస్తున్నదన్నారు. వాటిని సద్వినియోగం చేసుకొని ప్రతి విద్యార్ధి బాగా చదువుకొని కనీసం డిగ్రీ వరకు చదువుకోవాలన్నారు. విద్యార్ధి దశ నుండే చదువుతో పాటు తమ నైపుణ్యాన్ని పెంపొందించుకొవాలన్నారు. అందుకు ప్రతి విద్యార్ధి సమాజంలో జరుగుచున్న అంశాలపై అవగాహన పెంపొందించుకొవాలన్నారు. అందుకు గాను ప్రతి రోజు న్యూస్ పేపర్ ను పుస్తకాలను చదవడం అలవర్చుకోవాలన్నారు. ప్రతి విద్యార్థికి భవిష్యత్తు పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని, అప్పుడే వారు అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యార్థులు కాలాన్ని వృధా చేయకూడదని, గడిచిన కాలం తిరిగి రాదని, ఉన్న కాలాన్ని సద్వినియోగం చేసుకొని బాగా చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్య శాఖాధికారి కిరణ్ కుమార్, ఐసిడిఎస్ పిడి మాధురి, పాఠశాల ప్రదానోపాధ్యాయురాలు కృష్ణ కుమారి, ఉపాధ్యాయులు, విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఒంగోలులోని బాల సదనంను సందర్శించి బాల సదనంలో వుంటున్న పిల్లలతో మమేకమై వారి యోగ క్షేమాలను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
కలెక్టర్ వెంట ఐసిడిఎస్ పిడి మాధురి, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి దినేష్ కుమార్, బాల సదనం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


