పుస్తకాలను చదవడం ద్వారా గొప్ప జ్ఞానాన్ని ప్రసాదిస్తాయని, ప్రతీఒక్కరూ పుస్తకాలను చదవడం అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా పేర్కొన్నారు.
గురువారం స్థానిక జిల్లా గ్రంథాలయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ప్రారంభ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా , ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత పాల్గొన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా ముందుగా నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ… గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని, పుస్తకాల ద్వారా గొప్ప జ్ఞానాన్ని ప్రసాదిస్తాయని చెప్పారు. ఈ జ్ఞానం సమాజానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రతీఒక్కరూ పుస్తకాలను చదవడం అలవర్చుకోవాలని కోరారు. ఎందరో మహానుభావులు గ్రంథాలయాల్లోని పుస్తకాలను అధ్యయనం చేసి, ఉన్నత స్థానానికి చేరుకున్నారని, మహోన్నత పదవులను సంపాదించారని చెప్పారు. పుస్తకాలను అధ్యయనం చేయడం ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చన్నారు. ఈ గ్రంధాలయంలో సుమారు 6 లక్షల పైగా పుస్తకాలు అందుబాటులో వున్నాయని, పుస్తకాలు అందుబాటులో లేనివారు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తల్లి దండ్రులు కూడా తమ పిల్లలకు పుస్తకాలు చదివే అలవాటును ఆసక్తిని కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ …మంచి పుస్తకం మంచి స్నేహితుడుతో సమానమన్నారు. గతంలో న్యూస్ పేపర్ చదవాలన్నా గ్రంధాలయాలకు వెళ్ళే వారని, నేడు గ్రంధాలయాలకు వచ్చే వారి సంఖ్య తగ్గిపోతున్నదన్నారు. పుస్తక పఠన చాలా ముఖ్యమన్నారు. ఏదైనా అంశాన్ని లోతుగా సవివరంగా తెలుసుకోవాలంటే పుస్తకాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. విద్యార్ధి దశ నుండే పుస్తకాలను చదివే అలవాటును అలవార్చుకోవాలన్నారు. భావితరాలకు గ్రంధాలయాల ఆవశ్యకతను తెలియచేయాల్సిన భాద్యత ప్రతి ఒక్కరి పై ఉందన్నారు.
రిటైర్డ్ డిప్యుటీ కలెక్టర్ పేరయ్య, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు లక్ష్మా నాయక్ తదితరులు మాట్లాడుతూ.. పుస్తకాలను చదవడం ద్వారా మంచి చెడుల విచక్షణ కలుగుతుందని అన్నారు. ప్రతీఏటా వారోత్సవాలను నిర్వహించడం ద్వారా గ్రంథాలయాల ప్రాధాన్యత అందిరికీ తెలుస్తోందని అన్నారు. వివిధ రకాల పుస్తకాలను అధ్యయనం చేయడం ద్వారా ఎన్నో సామాజిక అంశాలపట్ల అవగాహన కలుగుతుందన్నారు.
జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి ఆదిలక్ష్మి మాట్లాడుతూ….ఈ రోజు నుండి 20వ తేదీ వరకు రోజుకొక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వారం రోజుల పాటు 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ఘనంగా జరుపుకోనున్నట్లు తెలిపారు.
అనంతరం జిల్లా కలెక్టర్ పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో విద్యార్దులు, ప్రజలు గ్రంధాలయ సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


