దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న మల్లెల తీర్థంలో శివరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. స్థానిక గిరిజన గూడెంలలో ఉండే చెంచులు మల్లెల తీర్థంలో ఉన్న శైవ క్షేత్రంలో పూజలు మొదలు పెట్టారు. శివ లింగం, దేవతా మూర్తుల విగ్రహాలు ఉన్నచోట చలువ పందిళ్లు వేశారు. గిరిజనులే స్వామి వారికి అన్నీ తామై పూజలు చేస్తున్నారు. పక్కనే సహజ సిద్ధమైన జలపాతం నుంచి జాలువారే పవిత్ర జలాలతో స్వామివారిని అభిషేకిస్తున్నారు.
2022లో సందర్శన నిలిపివేత :
మూడు సంవత్సరాలుగా మల్లెల తీర్థం సందర్శనను అటవీ శాఖ నిలిపివేసింది. మల్లెలతీర్థంలో ఉన్న జలపాతంలో ప్రమాదాలు జరుగుతున్నాయన్న కారణంగా 2022లో ఈ క్షేత్రాన్ని పూర్తిగా మూసేశారు. మల్లెల తీర్థం జలపాతానికి వెళ్లే దారిని ఫెన్సింగ్‌తో మూసేశారు. అలాగే, ఈ ప్రాంతానికి వెళ్లే దారిలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను అటువైపు వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారు.
జలపాతం పక్కనే మహిమాన్విత శివలింగం :
అయితే, మల్లెల తీర్థంలో జలపాతం మాత్రమే కాదు.. ఆ జలపాతం పక్కనే ఉన్న శివుడి లింగం అత్యంత మహిమాన్వితమైనదని స్థానికులు విశ్వసిస్తారు. ప్రధానంగా గిరిజనులు మల్లెల తీర్థం జలపాతంలో స్నానమాచరించి స్వామివారిని వేడుకుంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయని బలంగా నమ్ముతారు. అయితే, అటవీ శాఖ అధికారులు ఈ క్షేత్రానికి వెళ్లకుండా పూర్తిగా గేట్లకు తాళాలు వేయడం, ఫెన్సింగ్‌తో ఈ దారులు మూసివేయడంతో మూడు సంవత్సరాలుగా అటువైపు వెళ్లేవాళ్లే కనిపించడం లేదు. అడపా దడపా అటవీ శాఖ సిబ్బంది, అధికారులకు సంబంధించిన వాళ్లను మాత్రమే మల్లెల తీర్థం వెళ్లేందుకు అనుమతిస్తున్నారు.
సందర్శన కోసం గిరిజనుల అభ్యర్థన :
అయితే, మహిమాన్విత మల్లెల తీర్థం క్షేత్రం అధికారుల అనాలోచిత నిర్ణయాల వల్ల ఆదరణ లేకుండా పోతుందని చుట్టుపక్కల గిరిజన గూడెంలలో ఉండే ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, మనసుకు ఉల్లాసాన్ని కలిగించే మల్లెల తీర్థం సందర్శనను తిరిగి ప్రారంభించాలని మూడు సంవత్సరాలుగా గిరిజనులు అధికారులకు విజ్ఞప్తులు చేస్తున్నారు. అయినా పై స్థాయి అధికారుల నుంచి తమకు అనుమతి లేదంటూ కిందిస్థాయి అధికారులు తప్పించుకుంటున్నారు.
గిరిజనుల సంచలన నిర్ణయం :
ఇప్పుడు శివరాత్రి పర్వదినం సందర్భంగా గిరిజన గూడేలకు చెందిన ప్రజలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. సందర్శకులకు ఆహ్లాదాన్ని మాత్రమే కాదు.. కోరిన కోర్కెలు తీర్చే శివుడి క్షేత్రంలో ఆధ్యాత్మిక వాతావరణం కూడా ఉట్టిపడే ప్రాంతాన్ని ఇలా అనాథగా వదిలేయడం సరైంది కాదంటున్నారు. అందుకే శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు మొదలు పెట్టారు. ఆరు రోజుల పాటు.. మల్లెల తీర్థం జలపాతం పక్కనే ఉన్న శివుడి క్షేత్రంలో శివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.
శివరాత్రికి తరలి రండి :
మల్లెల తీర్థం జలపాతం మూసేశారని అందరికీ తెలియడంతో.. ఎవరూ అటువైపు రావడం లేదు. అయితే, శివరాత్రి ప్రత్యేక పూజల కోసం మాత్రం భక్తులు వెళ్లేందుకు అవకాశం ఉంది. పర్యాటకులు, భక్తులు తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్న గిరిజనులు కోరుతున్నారు. పర్యాటకులకు ఆహ్లాదం, భక్తులకు ఆధ్యాత్మిక వైభవం నింపే మల్లెల తీర్థాన్ని శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా సందర్శించుకోవచ్చునని చెబుతున్నారు.
ఇలా వెళ్లాలి :
హైదరాబాద్ నుంచి మల్లెల తీర్థం జలపాతం సరిగ్గా 190 కిలో మీటర్ల దూరం ఉంటుంది. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే దారిలో ఉందీ మల్లెల తీర్థం జలపాతం, శైవ క్షేత్రం. హైదరాబాద్ నుంచి వెళ్లేవాళ్లు.. శ్రీశైలానికి సరిగ్గా 50 కిలో మీటర్ల ముందు ఉన్న వటవర్ల పల్లి నుంచి ఎడమ వైపునకు వెళ్లాలి. వటవర్ల పల్లి నుంచి సరిగ్గా 8 కిలో మీటర్ల దూరంలో ఉందీ మల్లెల తీర్థం జలపాతం. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం కుడిచింతల బయలు గ్రామ సమీపంలో ఇది ఉంటుంది. ఈ మల్లెల తీర్థం వద్ద దాదాపు వంద ఎకరాల్లో అటవీశాఖ వృక్ష సంరక్షణ కేంద్రం ఉంది. ఆ వృక్ష సంరక్షణ కేంద్రం లోపలినుంచి నడుచుకుంటూ వెళ్తే మెట్ల మార్గం వస్తుంది. ఆ మెట్లమార్గంలో ఉన్న 368 మెట్లు కిందికి దిగితే మల్లెల తీర్థం జలపాతం వస్తుంది. అల్లంత దూరం నుంచే జలపాతం శబ్దాలు మదిని దోచేస్తాయి. మెట్లు దిగుతున్న కొద్దీ.. చుట్టూ కొండలు, లోయలు, ఆకాశాన్నంటే ఎత్తైన చెట్లు కనువిందు చేస్తాయి. ఇక, మెట్ల దారి గుండా కిందికి దిగగానే.. దాదాపు 200 అడుగుల ఎత్తు నుంచి జాలువారే జలపాతం అందరినీ ఆకట్టుకుంటుంది. ఆ జలపాతం పక్కనే శివలింగం, దేవతా మూర్తుల విగ్రహాలు ఉంటాయి. ఆధ్యాత్మికతను పంచుతాయి. అక్కడ ఎలాంటి గుడి గానీ, ఆచ్చాదన గానీ ఉండదు. చెట్ల కింద శివయ్య, దేవతా మూర్తులు కొలువై ఉంటారు. అయితే, ఇప్పుడు శివరాత్రి ఉత్సవాల కోసం గిరిజనులు పందిర్లు ఏర్పాటు చేశారు.



