ఒంగోలు జిల్లాలోని తమ పశువులకు పోషకులు బీమా చేయించుకోవాలని పశుసంవర్థకశాఖ జిల్లా అధికారి (డీఏహెచ్వో) డాక్టర్ బేబీరాణి శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. పశుపోషకుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందన్నారు. ఒకసారి బీమా ప్రీమియం చెల్లిస్తే మూడేళ్ల వరకు వర్తించేలా చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. జిల్లాకు మొదటి విడతలో రూ.18లక్షల రాయితీని గత ఏడాది ఆగస్టులోనే ప్రభుత్వం విడుదల చేయగా ప్రస్తుతం రూ.16 లక్షలు విడుదల చేసిందన్నారు. బీమా చేయించుకోవడం ద్వారా పశువులు మృత్యువాత పడిన సమయంలో పరిహారం అందుతుందని తెలిపారు. ఒకొక్క పశువుకు రూ.15వేలకు రూ.960 ప్రీమియం ఉండగా ప్రభుత్వ వాటా రూ.768, రైతు వాటా రూ.192 చెల్లించాలన్నారు. రూ.30వేల బీమాకు ప్రీమియం రూ.1,920 ఉండగా ప్రభుత్వవాటా రూ.1,536, రైతు వాటా రూ.384, గేదెలు, మేకలు ప్రీమియం రూ.375 ఉండగా ప్రభుత్వ వాటా రూ.300, రైతు వాటా రూ.75 చె ల్లించాల్సి ఉంటుందన్నారు. రైతులందరూ ఈ బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
