నియమిత ఆహారం, ప్రశాంతమైన నిద్ర, చదువు పై ఏకాగ్రత, ప్రశాంత చిత్తం విజయానికి సోపానాలని వక్తలు తెలిపారు. స్థానిక రామనగర్ 8వ వీధిలోని బిఆర్ ఒలంపియాడ్ స్కూల్ పదవతరగతి విద్యార్ధులకు ఆల్ ద బెస్ట్ తెలుపడానికి తొమ్మిదవ తరగతి విద్యార్ధులు ఏర్పాటుచేసిన కాన్డి సెన్ట్ ఫేర్ వెల్ – 2025 సమావేశమునకు స్కూల్ ప్రధానోపాధ్యాయులు కే. దిలీప్ కుమార్ రెడ్డి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిధులుగా విశ్రాంత డిప్యూటి తహసిల్దార్ ఆర్విఎన్వి ప్రసాద్ మరియు గౌరవ అతిధులుగా రిటైర్డ్ తహసిల్దార్ సయ్యద్ ఇస్మాయిల్, జిమ్స్ మరియు బిఆర్ స్కూల్ ఛైర్మన్ యం. రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భముగా సయ్యద్ ఇస్మాయిల్ తమ సందేశంలో విద్యార్ధి విజయం సాధించడంలో తల్లిదండ్రులు ప్రముఖ పాత్ర పోషిస్తారని తెలుపుచూ విద్య త్రికోణంగా భావిస్తే శిఖరాగ్ర కోణం తల్లిదండ్రులు మిగిలిన కోణాలు గురువులు, విద్యార్ధులని వివరించారు. ఈ ముగ్గురు కలసి సమిష్టిగా కృషిచేస్తే విద్య పరిపూర్ణమౌతుందని, అనుభవజ్ఞులైన గురువులకు విధేయులుగా ఉన్న విద్యార్ధులు చదువులో రాణిస్తారని, భవిత్యత్ లక్ష్యాల సాధనపై ఆశ/విశ్వాసం కలిగి ఉండాలని ఉద్భోదించారు. చదివినది పరీక్షలో సంపూర్ణంగా రాయడానికి పూర్తిగా అవపోశన పట్టాలి. అలా చదివిననాడు ప్రసన్నవదనం కలిగి ఉంటారని తెలిపారు. “చదివనిది ఏదీ రాదు, చదివినది ఏదీపోదు” కావున ప్రతి విద్యార్ధీ చదువుపై ద్యాస పెట్టాలని, తల్లిదండ్రులు తమ పిల్లలను ఇతర విద్యార్ధులతో పోల్చవద్దని, తగిన విశ్రాంతి, విరామం కల్పించి వారు స్వతహగా చదువుకొనే విధంగా ప్రోత్సహించాలని సూచన చేశారు.
ముఖ్య అతిధి ఆర్విఎన్వి ప్రసాద్ మాట్లాడుచూ… పఠనం, మననం, ధ్యానం ఈ మూడు పాటించడంతో ప్రశాంత స్థితి చెంది పరీక్షలను అతి సులువుగా వ్రాయగలగుతారని వివరించారు.
స్కూల్ ప్రిన్సిపల్ కే. దిలీప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మా విద్యార్ధులు గత మూడు సంవత్సరాలకంటే ఉన్నతమైన విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. తమ విద్యార్ధులను మా ఉపాధ్యాయులు అత్యంత సులభమైన మెలకువలతో విద్యను బోధిస్తున్నారని, విద్యార్ధులు సైతం ఉత్సాహంగా, తపనతో చదువుచున్నారని తెలిపారు.
తదుపరి సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా 9వ తరగతి, 10వ తరగతి విద్యార్థులు పలుగీతాలకు చేసిన నృత్యాలు సభికులను అలరించాయి.



