తాళ్లూరు మండలం దారంవారిపాలెం గ్రామంలో రాముల వారి దేవాలయానికి వదిలిన దేవుని ఆవు వయోభారంతో గత నవంబరులో మృతిచెందడంతో పూడ్చిపెట్టారు. గ్రామస్థులు కలిసికట్టుగా వాగు ఒడ్డున పూడ్చినచోట సమాధి నిర్మించారు. సమాధిపై శనివారం ఆవు విగ్రహాన్ని ప్రతిష్ఠించి గోమాతపై తమకున్న ప్రేమాభిమానాలు చాటుకున్నారు.
గ్రామంలో రాములవారి దేవాలయ ప్రతిష్ఠ సమయంలో గోమాతను దేవుని ఆవుగా వదిలారు. ఆగోమాత నిత్యం గ్రామంలో తిరుగుతుండేది. ప్రతి ఇంటి వారు ఆవుకు ఆహార పదార్థాలు అందించేవారు. దీంతో ప్రతిఒక్కరూ గోమా తపై ప్రేమాభిమానం పెంచుకున్నారు. గత నవంబరులో ఆవు మృతి చెందినప్పుడు ప్రత్యేక వాహనంపై గ్రామంలో ఊరేగింపు నిర్వహించి గ్రామ శివారున దోర్నపువాగు ఒడ్డున ఖాళీ స్థలంలో ఖననం చేశారు. దేవునిఆవు జ్ఞాపకాలను మరిచిపోలేని గ్రామస్థులు కలిసికట్టుగా సమాధి నిర్మించాలని తలంచారు. మూడు నెలల క్రితం మృతి చెందిన దేవుని ఆవుకు సమాధి నిర్మించారు. సమాధిపై ఆవు విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు తయారుచేయించిన విగ్రహాన్ని శని వారం గ్రామంలో ఊరేగించారు. గ్రామస్థులు, అధిక సంఖ్యలో మహిళలు సమాధి వద్దకు వచ్చి పూజలు చేసి విగ్రహాన్ని సమాధిపై ఏర్పాటుచేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. పూజారి నరసింహారావు ఆధ్వర్యంలో పూజా కార్య క్రమాలు, విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు జరిగాయి.


