రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఒంగోలు నగర శాఖ ఆధ్వర్యంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక అంజయ్య రోడ్డు లోని ఆంధ్ర కేసరి విద్యా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఉగాది పంచాంగ శ్రవణాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ముందుగా రెండువందల అరవైఐదు మంది స్వయం సేవకులు గణవేష ధరించి దండధారులై అంజయ్యరోడ్డు, మంగమూరు రోడ్డు పంచముఖ ఆంజనేయస్వామి దేవాలయం మీదుగా నిర్మల్ నగర్ లో “పధ సంచలనం” చేశారు. అసాంతం పధ సంచలనం లో స్వయం సేవకులపై హిందూ బంధుగణం పూలుచల్లారు.
సభా సమావేశానికి ముందుగా స్వయం సేవకులు దండతో పలు విన్యాసాలను ప్రదర్శించారు భారీ ఢంకా, తదితర సంగీత సాధనాలతో ఘోష ప్రతిధ్వనింప చేశారు.
సమావేశానికి ముఖ్య అతిథులుగా నగరంలోని ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వాహకులు డా. చాపల వంశీకృష్ణ విచ్చేశారు. స్వయం సేవకుల నిబద్ధత, క్రమశిక్షణ వల్ల ప్రపంచంలో ఆరెస్సెస్ సంస్థ ప్రధమ స్ధానంలో ఉన్నదని శ్లాంఘించారు. ప్రధాన వక్తగా జిల్లా సహకార్యవాహ కాలంరాజు విశ్వేశ్వరరావు మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ కేశవరామ్ బలిరాం హెగ్డేవార్ ఉగాది పర్వదినమున జన్మించారని, వారు స్థాపించిన సంఘం వంద సంవత్సరాలకు చేరువలో ఉన్నదని, దేశానికి తొలి ప్రాధాన్యతగా సంఘసేవకులను తీర్చిదిద్దారని వివరించారు. సోషల్ మీడియాలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు దేశ స్వాతంత్ర సాధనలో పాల్గొనలేదన్న వార్త అవాస్తవమని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను స్వాతంత్ర్య సాధనలో పాల్గొనాలని డాక్టర్ జీ ప్రేరేపించి పలు ఉద్యమాలలో పాల్గొనేలా చేశారని సోదాహరణగా వివరించారు. జిల్లా సంఘచాలక్ రావినూతల రాంప్రసాద్, నగర సంఘచాలక్ బత్తిన మహేష్, తదితరుల సంఘ బాధ్యులు, పెద్ద సంఖ్యలో సంఘసేవకులు, కుటుంబ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.
చివరగా సంఘగీత్ ఆలపించి, ధ్వజ ప్రణామం చేసి ఉగాది ఉత్సవం ముగించారు.






