శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా మే 5వ తేదీ, సోమవారం ఉదయం పెద్ద సంఖ్యలో ఆర్యవైశ్య మహిళలు 108 కలిశాలతో స్థానిక రంగారాయుని మంచినీటి చెరువు నుండి తీర్థ జలమును తీసుకుని వచ్చి అమ్మవారికి అభిషేకం నిర్వహించారు.
కార్యక్రమంలో తొలిగా వినాయక పూజను ఉభయ దాతులచే ఆలయ అర్చకులు నిర్వహింప చేశారు. తదుపరి 108 కలిశాలను సిద్ధం చేసి జై వాసవి జై జై వాసవి నామస్మరణతో మహిళలు తమ తలపై పెట్టుకుని రంగారాయుని చెరువుకు స్థానిక గాంధీ రోడ్డు, దక్షిణం బజార్, ఏనుగు చెట్టు వీధి, పప్పు బజార్, బంగారు వర్తక దుకాణ సముదాయాల మీదుగా ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల మీదుగా శోభాయమానంగా మంగళ వాయిద్యముల నడుమ రంగారాయుని చెరువు చేరుకున్నారు. తదుపరి గంగా మాతకు పూజ నిర్వహించి అభిషేక జలము సేకరించి ఆలయమునకు విచ్చేశారు. పువ్వాడ శ్రీమన్నారాయణ వాసవి పతాకమును ఎగురవేసి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మహిళలు ఒక్కొక్కరిగా అభిషేక జలమును అర్చకులకు అందించి అమ్మవారికి అభిషేకింపజేశారు. రంగారాయుని చెరువు వద్ద నగరంలోని వాసవి క్లబ్ సభ్యులు శోభాయాత్రలో పాల్గొన్న భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు.
సాయంత్రం జరిగిన కార్యక్రమంలో శ్రీ వాసవి కోలాట భజన మండలి సభ్యులు, పెద్ద సంఖ్యలో ఆర్యవైశ్య మహిళలు స్థానిక గాంధీ రోడ్డులోని కోదండ రామస్వామి దేవస్థానం వద్ద నుండి శ్రీ వాసవి మాతకు 108 రకాల దివ్య పరిమళ పుష్ప ఫల ప్రసాదాలతో ఊరేగింపుగా విచ్చేసి సారె సమర్పించారు. కార్యక్రమంలో పెనుగొండ నుండి చెన్నై బయలుదేరిన వాసవి జ్యోతి ఆలయమునకు రాగా భక్తులు నీరాజనాలు సమర్పించారు. తదుపరి వాసవి కోలాట భజన మండలి వారిచే కోలాట నర్తనం, గుడి ఉత్సవం తీర్థ ప్రసాద వినిమయం జరిగినది.




