ఘనంగా శ్రీ హర్షిణీ మహిళా ఇంజనీరింగ్ కళాశాల ప్రారంభం

శ్రీ హర్షిణి విద్యా సంస్థల అధినేత గోరంట్ల రవికుమార్ ఆధ్వర్యంలో ఒంగోలుకు సమీపంలోని ఏడుగుండ్ల పాడు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ హర్షిణి మహిళా ఇంజనీరింగ్ కళాశాలను రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ శ్రీ హర్షిణి మహిళా ఇంజనీరింగ్ కళాశాల రాష్ట్రంలోనే నంబర్ వన్ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. చిన్న కోచింగ్ సెంటర్ తో ప్రారంభమైన రవికుమార్ నేడు మహిళా ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేసే స్థాయికి అంచలంచెలుగా ఎదగటం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందన్నారు. పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించేందుకు రవికుమార్ చొరవ చూపాలని కోరారు. కళాశాలలో సీటు తాము రికమండేషన్ లెటర్ ఇచ్చే స్థాయికి కళాశాల ఎదగాలని కోరారు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ జిల్లాలో తొలి మహిళా ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయటం పట్ల తనకు ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా విద్యకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందన్నారు. మధ్యలో చదువు మానేసిన విద్యార్థులకు విద్యను మరింత చేరువ చేయాలని రవికుమార్ ను కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళా విద్యను ప్రోత్సహిస్తున్నారు అన్నారు. అలాగే రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలోకి అత్యున్నత యూనివర్సిటీని తీసుకువచ్చి విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలు కల్పించడం ఆనందదాయకమన్నారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ 1995లో చిన్న కోచింగ్ సెంటర్ తో ప్రారంభమైన రవికుమార్ ఎంతో కష్టపడి నేడు మహిళా ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేయటం మంచి పరిణామం అన్నారు. కేజీ నుండి జూనియర్ కళాశాలలో, డిగ్రీ, పీజీ కళాశాలలతో పాటుగా మహిళా ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేయటం గొప్ప విషయం అన్నారు. నేడు ఆడపిల్లలు అన్ని రంగాలలో ముందు ఉన్నారన్నారు. విదేశాలలో ఒంటరిగా విద్యను అభ్యసించటం తో పాటుగా, మహిళలు ఉద్యోగాలు కూడా చేస్తున్నారని తెలిపారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే బి ఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ తమ నియోజకవర్గ పరిధిలో మహిళా ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. మహిళా ఇంజనీరింగ్ కళాశాల అతి త్వరలో వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో తొలిసారిగా మహిళ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయటం ఆహ్వానించ తగ్గ విషయం అన్నారు. ఇప్పటికే పలువురు మహిళలు ఉన్నత విద్య కోసం సుదూర ప్రాంతాలకు పోయి చదువుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. విద్యార్థుల జీవితాలలో మంచి వెలుగులు ప్రసాదించేందుకు రవికుమార్ కృషి చేయాలని కోరారు. ఏపీ మారిటైమ్ బోర్డ్ కార్పొరేషన్ చైర్మన్ దామచర్ల సత్య మాట్లాడుతూ గోరంట్ల రవికుమార్ కష్టంతో అంచలంచెలుగా ఎదిగిన వ్యక్తి అన్నారు. పేద విద్యార్థులకు తన వంతు సహకారం ఎల్లవేళలా రవికుమార్ అందిస్తారని పేర్కొన్నారు. కొండేపి నియోజకవర్గం నుండి పేద విద్యార్థులను పంపితే వారికి ఫీజులలో రాయితీస్తూ పేదల విద్యకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్న వ్యక్తి రవికుమార్ అన్నారు. ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ విద్యారంగంలో ఎంతో అనుభవం ఉన్న గోరంట్ల రవికుమార్ నుండి మహిళా ఇంజనీరింగ్ కళాశాల రూపుదిద్దుకోవటం ఎంతో ఆనందం అన్నారు. డిగ్రీ విద్యార్థులకు ప్లేస్మెంట్లలో ఎక్కువ ఉద్యోగాలు అందించిన రవికుమార్, ఇంజనీరింగ్ విద్యలో కూడా అదే వరవడి కొనసాగించాలని ఆకాంక్షించారు. ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ శ్రీ హర్షిణి విద్యాసంస్థలు అంటే నమ్మకానికి మారుపేరు అని, ఇంజనీరింగ్ విద్యలో కూడా విద్యార్థుల తల్లిదండ్రుల నమ్మకానికి అనుకూలంగా మంచి విద్యతోపాటు, ఉద్యోగాలు దక్కేలా రవికుమార్ పనిచేయాలని సూచించారు. కార్యక్రమానికి ముందుగా ఒంగోలు ఎంపీ బాగుంట శ్రీనివాసులు రెడ్డి హాజరై శ్రీ హర్షిని మహిళా ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేస్తున్న గోరింట్ల రవికుమార్ ను అభినందించారు.అనంతరం కళాశాల బ్రోచర్ను, కళాశాల పర్మిషన్ లెటర్ ను అతిధుల చేతుల మీదగా ఆవిష్కరించారు. అంతకు ముందుగా అతిధుల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. కళాశాల ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని మంత్రులు ఆవిష్కరించగా, ప్రత్యేక పూజలను ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రవికుమార్ దంపతులను అభినందించారు. కార్యక్రమంలో శ్రీ హర్షిణి విద్యాసంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గోరంట్ల కవిత, డైరెక్టర్లు డాక్టర్ గోరంట్ల హర్షిణి, గోరంట్ల వెంకట హర్షిత, విద్యాసంస్థల డీన్ దాది ఆంజనేయులు, ప్రిన్సిపల్స్, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *