రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు అర్హులైన పేద వర్గాల ప్రజలకు సమగ్రంగా అందించచాలి – ప్రకాశం జిల్లా సమగ్రాభివృద్దికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో సమగ్రమైన ప్రణాళికలతో పనిచేయాలి – రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మరియు జిల్లా ఇంచార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి -జిల్లా సమీక్ష మండలి సమావేశం నిర్వహణ

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు అర్హులైన పేద వర్గాల ప్రజలకు సమగ్రంగా అందించడంతో పాటు ప్రకాశం జిల్లా సమగ్రాభివృద్దికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో సమగ్రమైన ప్రణాళికలతో పనిచేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మరియు జిల్లా ఇంచార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
పేర్కొన్నారు.
సోమవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా సమీక్ష మండలి సమావేశం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ, డ్రింకింగ్ వాటర్, పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లి యోజన, పిజిఆర్ఎస్ తదితర అంశాలపై క్షుణ్ణంగా సమీక్షించి ఆయా కార్యక్రమాల అమలులో నెలకొని వున్న సమస్యల పరిష్కారానికి ఇంచార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, అధికారులకు దిశానిర్దేశం చేసారు. ఈ సమావేశానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామాత్యులు డా. డోలా బాల వీరాంజనేయ స్వామి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా, శాసన మండలి సభ్యులు తూమాటి మాధవరావు, ఒంగోలు, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు, దర్శి, యర్రగొండపాలెం, ఎస్.ఎన్ పాడు, కందుకూరు శాసన సభ్యులు దామచర్ల జనార్ధన రావు, కందుల నారాయణ రెడ్డి, డా. ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి, ముత్తుముల అశోక్ రెడ్డి, డా. బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి, టి. చంద్రశేఖర్, బి.ఎన్ విజయ కుమార్, ఇంటూరి నాగేశ్వర రావు, ఎపి మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, రాష్ట్ర పర్యాటకాభివృద్ది సంస్థ చైర్మన్ డా నూకసాని బాలాజీ, ఎపి స్టేట్ అగ్రికల్చర్ మిషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాసుల రెడ్డి, ఎపి మాల వెల్ఫేర్ కో ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ డా పి విజయ కుమార్, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ, వై పాలెం , దర్శి నియోజక వర్గాల ఇంచార్జీలు ఎరెక్షన్ బాబు, డా లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఇన్‌చార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ, ఈ రోజు జరిగిన జిల్లా సమీక్ష మండలి సమావేశంలో సహచర మంత్రి డా. డోలా బాల వీరాంజనేయ స్వామి, జిల్లా శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, వివిధ కార్పోరేషన్ల చైర్మన్ల సమక్షంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ, డ్రింకింగ్ వాటర్, పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లి యోజన, పిజిఆర్ఎస్ తదితర శాఖల ద్వారా అమలు జరుగుచున్న కార్యక్రమాల అమలులో క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి సమస్యలపై పూర్తిగా అవగాహన కల్పించుకొని కూలంకషంగా చర్చించడంతో పాటు ఆ సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదన్నారు. తొలుత ఉపాధి హామీ పధకం ద్వారా అమలు జరుగుచున్న పనుల పురోగతిపై చర్చించడం జరిగిందని, ఉపాధి లేని పేద వర్గాల ప్రజలకు ఉపాధి హామీ పధకం ద్వారా కచ్చితంగా ఉపాధి కల్పించడంతో పాటు జరుగుచున్న పనులు సత్వరం పుర్తిచేసేలా అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. ఎక్కడా ప్రజలు త్రాగునీటికి ఇబ్బంది పడరాదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, అందు కనుగుణంగా వేసవిలో సురక్షిత త్రాగునీటి సరఫరా పై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి జిల్లాలో ఎక్కడా త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. జిల్లాలోని 17 మండలాల్లో కరువు ఉన్నదని అధికారులు నివేదికలు ఇచ్చారని, ఆ ప్రాంతాలతో పాటు జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో త్రాగునీటి సమస్య పరిష్కారానికి సమగ్రమైన ప్రణాళికతో జిల్లా యంత్రాంగం మంత్రి డా డోలా వీరాంజనేయ స్వామి నాయకత్వంతో ముందకు సాగాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రజలందరికీ రక్షిత మంచినీరు అందించేందుకు ఏఏ గ్రామాల్లో రక్షిత త్రాగునీటి పథకాలకు మరమ్మత్తులు చేయించాల్సి ఉంది, అందుకవసరమైన నిధుల లభ్యత, తదితర వివరాలతో వెంటనే ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. జల జీవన్ మిషన్ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చినటు వంటి ఒక వరమని, గడిచిన 5 సంవత్సరాల కాలంలో జల జీవన్ మిషన్ కార్యక్రమం కింద పనులు చేపట్టలేదని, రాష్ట్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర గ్రాంటు నిధులు మంజూరు చేయకపోవడంతో చాలా పనులు ఆగిపోయాయని, జల జీవన్ మిషన్ కార్యక్రమం ఈ సంవత్సరం ముగింపు దశకు వచ్చే పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప్రత్యేకంగా చొరవ తీసుకుని జల్ జీవన్ మిషన్ పధకాన్ని రాష్ట్రంలో మరో రెండేళ్ళు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ, ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్ళడంతో ఈ పధకంను రాష్ట్రంలో 2028 వరకు పొడిగించడం జరుగుతుందని ప్రధాన మంత్రి హామీ ఇవ్వడం జరిగిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి కుళాయి ద్వారా త్రాగు నీరు ఇవ్వాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని, అందులో భాగంగానే జల జీవన్ మిషన్ కార్యక్రమాన్ని గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. కరువు పీడిత ప్రాంతంగా ఉన్నటువంటి ప్రకాశం జిల్లా లో త్రాగు నీటి పధకాలను మరింత వేగవంతం చేయడానికి కృషిచేస్తున్నట్లు మంత్రి తెలిపారు. సంక్షేమ ఫలాలు పేద వర్గాల ప్రజలకు, మధ్యతరగతి రైతు కుటుంబాలకు సక్రమంగా అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. జిల్లాలో నెలకొని వున్న పొగాకు రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ఈ రోజు పొగాకు బోర్డు అధికారులతో, పొగాకు రైతులతో మాట్లాడటం జరుగుతుందని మంత్రి తెలిపారు. రైతులకు అండగా వుంటూ వారి ఆర్ధికాభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి తెలిపారు. పట్టణ, నగర ప్రాంతాలల్లో నిర్ధకమైన, ఖాళీగా ఉన్నటువంటి స్థలాలను అభివృద్ధి చేయుటకు ఎ విధమైన ప్రాజెక్ట్స్ పెట్టితే బాగుంటుంది , ఆయా నగర కార్పోరేషన్ లకు ఆదాయం వనరులు సమకురుతాయన్న అంశంపై ఒంగోలు పార్లమెంట్ సభ్యులు వారు నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పోరేషన్ ఎన్. బి. సి. సి అనే సంస్థ తీసుకురావడం జరిగిందని, ఆ సంస్థ వారు వివరాలను కూడా వివరించడం జరిగిందని, ఈ విషయాన్ని సమగ్రంగా పరిశీలన చేయాల్సిన అవసరం వుందని మంత్రి తెలిపారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వ సహకారం కూడా ఉంటుందని మంత్రి తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ… జిల్లా ను అన్నీ రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు కలసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు చర్చించిన అంశాలను పూర్తీ చేసేలా కృషి చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల త్రాగునీటి అవసరాలపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు జిల్లా లో ఫారం పాండ్స్ నిర్మాణాలు పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు తెలిపారు. మూగ జీవాలకు కుడా త్రాగునీటిని అందించే లక్ష్యంతో ఉపాధి హామీ పధకం కింద పశువుల నీటి తోట్టెల నిర్మాణాలను జిల్లాలో చేపట్టినట్లు మంత్రి డా. డోలా బాల వీరాంజనేయ స్వామీ తెలిపారు.

జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ.. జిల్లాలో పంచ ప్రాధ్యానత కింద ఉపాధి హామీ పధకం పనులు ముమ్మరంగా జరుగుచున్నవని తెలిపారు. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు చర్చించిన అంశాలను పరిగణలోకి తీసుకొని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో ప్రజలు త్రాగునీటికి ఇబ్బంది పడకుండా అవసరమైన చర్యలు చేపట్టడంతో పాటు ఉపాధి హామీ పనులు క్షేత్ర స్థాయిలో పటిష్టంగా అమలు జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. పట్టణ నగర ప్రాంతాలల్లో ఖాళీగా ఉన్నటువంటి స్థలాలను అభివృద్ధి చేయుటకు నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పోరేషన్ వారిచే పరిశీలన చేయించడం జరుగుచున్నదని తెలిపారు.

ఎపి మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ మాట్లాడుతూ, జిల్లాలో నీటి వనరులు లేని నియోజక వర్గం కొండపి నియోజకవర్గమని, ఈ నియోజక వర్గం పై ప్రత్యేక దృష్టి సారించి రక్షిత మంచినీటి పధకాలను అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. పాకల బీచ్ ను అభివృద్ధి చేయాలని అలాగే సింగరాయకొండ, టంగుటూరు, సురారెడ్డిపాలెం వద్ద ఆర్ ఓ బి నిర్మాణాలకు చర్యలు చేపట్టాల్సిన అవసరం వుందని తెలిపారు.

రాష్ట్ర పర్యాటకాభివృద్ది సంస్థ చైర్మన్ డా నూకసాని బాలాజీ మాట్లాడుతూ… బింగినిపల్లి చెరువు పరిధిలో ఆక్వా సాగు ఎక్కువగా జరుగుచున్నందున మంచినీటి వనరులు ఉప్పు నీటిగా మారుతున్నాయని, దీనిపై అవసరమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం వుందని ఇంచార్జి మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

శాసన మండలి సభ్యులు తూమాటి మాధవరావు మాట్లాడుతూ…. ఈ సంవత్సరం అన్నీ పంటల్లో గిట్టుబాటు ధరలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, రైతాంగాన్ని ఆదు కోవాల్సిన అవసరం ఉందన్నారు.

ఒంగోలు శాసన సభ్యులు దామచర్ల జనార్ధన రావు మాట్లాడుతూ… ఒంగోలు నగర ప్రజలకు సురక్షిత త్రాగు నీటి సరఫరాతో పాటు అమృత్ పధకం కింద చేపట్టిన పనులు సత్వరం పూర్తీ చేసేలా చర్యలు చేపట్టాలని మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. గత ప్రభుత్వం హయాంలో 23,636 మందికి ఇంటి పట్టాలు ఇవ్వడం జరిగిందని, అందులో సుమారు 13 వేల మంది లబ్దిదారులను అనర్హులుగా అధికారులు గుర్తించడం జరిగిందని, అనర్హులను తొలగించి అర్హులైన వారికి ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఇంటి పట్టాలు ఇవ్వాలని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

గిద్దలూరు శాసన సభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి మాట్లాడుతూ… గిద్దలూరు నియోజక వర్గంలోని 6 మండలాలలో 3 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించడం జరిందని, మిగిలిన 3 మండలాలను కూడా కరువు మండలాలుగా ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. రీ సర్వే జరిగిన గ్రామాల్లో ఆర్ ఎస్ ఆర్ కంటే వెబ్ ల్యాండ్ లో తక్కువ భూమి నమోదు కావడం జరిగిందని, దీనిపై రెవెన్యూ అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం వుందన్నారు. కొమరోలు మండలంలో ఆర్ ఆర్ ప్యాకేజి కింద అర్హత లేకుండానే కొంతమంది అక్రమంగా 7 కోట్ల రూపాయలు లబ్దిపొందారని, దీనిపై సమగ్రంగా విచారణ చేయాల్సిన అవసరం వుందని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

మార్కాపురం శాసన సభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ, పశ్చిమ ప్రకాశం జిల్లాలో చాలా గ్రామాల్లో ప్రజలు త్రాగు నీటికి ఇబ్బందులు పడుతున్నారని, కొన్ని చోట్ల బోర్లు మరమత్తులు గురి కాగా, మరి కొన్ని చోట్ల పైప్ లైన్లు దెబ్బతిన్నాయని, వీటికి తక్షణం మరమత్తులు చేపట్టాల్సిన అవసరం వుందని శాసన సభ్యులు సమావేశంలో ప్రస్తావించడం జరిగింది. గతంలో ప్రజల త్రాగునీటి అవసరాలకు నీటిని రవాణ చేయడం జరిగిందని, వాటికి సంబందించిన బిల్లులు వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఇంచార్జి మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. తర్లుపాడు మండలంలో జరిగిన రెవెన్యూ సదస్సులో వచ్చిన ఆర్జీల పరిష్కారంలో సంబంధిత అధికారులు అలసత్వం ప్రదర్శించడం జరిగిందని, దీనిపై సమగ్ర విచారం చేయాల్సిన అవసరం వుందని శాసన సభ్యులు, ఇంచార్జి మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

ఎస్.ఎస్.పాడు శాసన సభ్యులు బి.ఎన్. విజయకుమార్ మాట్లాడుతూ… నాగులుప్పలపాడు రక్షిత మంచినీటి పధకం గత 10 రోజుల నుండి పనిచేయడం లేదని, సత్వరం పనిచేసేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం వుందని శాసన సభ్యులు, ఇంచార్జి మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు.

దర్శి శాసన సభ్యులు డాక్టర్ బూచే పల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ… నియోజక వర్గ పరిధిలో ప్రజలు త్రాగునీటికి ఇబ్బంది లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం వుందని, అమృత్ పధకం కింద చేపట్టిన పనులు పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని ఇంచార్జి మంత్రి దృష్టికి తీసుకురావడం జరిగింది.

కనిగిరి శాసన సభ్యులు డా. ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి మాట్లాడుతూ… కనిగిరి మునిసిపాలిటి పరిధిలో మూడు గ్రామాలు విలీనం కావడం జరిగిందని, ఆయా గ్రామాలలో ఉపాధి హామీ పనులు అమలు చేయాల్సిన అవసరం వుందని ఇంచార్జి మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. నియోజకవర్గ పరిధిలోని రక్షిత మంచి నీటి పధకాలకు సంబంధిన మోటార్లు తరచూ మరమత్తులకు గురికావడంతో ప్రజలు త్రాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని, వాటి స్థానంలో కొత్త మోటార్లు ఏర్పాటుచేయాల్సిన అవసరం వుందని శాసన సభ్యలు, ఇంచార్జి మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

యర్ర గొండపాలెం శాసన సభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ…. నియోజక వర్గంలో తాగునీటి సమస్య ఎక్కువగా వుందని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గ్రామాల్లో సర్పంచుల తీర్మాణాలు లేకుండా ఉపాధి పనులు చేపట్టినట్లు శాసన సభ్యులు, ఇంచార్జి మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. గతంలో ప్రజల త్రాగునీటి అవసరాలకు నీటిని రవాణ చేయడం జరిగిందని, వాటికి సంబందించిన బిల్లులు వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను కోరారు.

తొలుత ఆపరేషన్ సిందూర్ లో భాగంగా దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్ లకు నివాళులు అర్పిస్తూ మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులు రెండు నిమిషాలు పాటు మౌనం పాటించారు.

ఈ సమావేశంలో మార్కాపురం సబ్ కలెక్టర్ సహదీత్ వెంకట త్రివినాగ్ జిల్లా రెవెన్యు అధికారి చిన ఓబులేసు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *