జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనుల్లో ఎప్పటికప్పుడు పురోగతి చూపడంతో పాటు పని ప్రదేశంలో త్రాగునీరు, నీడ షెడ్ తదితర మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, డ్వామా అధికారులను ఆదేశించారు.
గురువారం మద్దిపాడు మండలం ఇనమనమెల్లూరు గ్రామ పంచాయితీలో జరుగుతున్న ఉపాధిహామీ పధకం పనులను కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్బంగా మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పధకం ద్వారా ఇనమనమెల్లూరు గ్రామంలో సాగునీటి కాలువ పూడిక తీత పనులు చేస్తున్న ఉపాధిహామీ కూలీల దగ్గరకు జిల్లా కలెక్టర్ స్వయంగా వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధిహామీ కూలీలు వారి పనిచేసిన పనికి సకాలంలో వారి ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయి లేనిదీ ఆరాతీశారు. అదేవిధంగా కూలీల పనిప్రదేశంలో త్రాగునీరు, నీడ షెడ్ తదితర మౌలిక సదుపాయాల కల్పనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పని ప్రదేశంలో కూలీలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఎండల ప్రభావం ఎక్కువగా ఉన్నందున అన్ని జాగ్రత్తలు తీసుకుని పనిచేసుకోవాలన్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అందుబాటులో ఉండేలా చూడాలని సంబంధిత ఉపాధి హామీ పదకం సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ వెంట డ్వామా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
