టీడీపీకి కార్యకర్తలే బలమైన పునాదులని, కార్యకర్తల త్యాగాలు వెలకట్టలేనివని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. కొండపిలోని శ్రీ సాయి సీతారామ కళ్యాణమండపంలో కొండపి నియోజకవర్గ మినీ మహానాడు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి, మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలనుద్దేశించి మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి
మాట్లాడుతూ…. టీడీపీకి కార్యకర్తలే పార్టీకి బలమైన పునాదులు, కార్యకర్తల త్యాగాలు వెలకట్టలేనివి అన్నారు. కార్యకర్తల సంక్షేమానికి సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ కృషి చేస్తున్నారు. గత వైసిపి ప్రభుత్వంలో నియోజకవర్గంలోని 41మంది టిడిపి కార్యకర్తలపై మోపిన అక్రమ కేసులను ఎత్తివేసామని, గత ముఖ్యమంత్రి జగన్ తన చేతకాని అసమర్ధ పాలనతో రాష్టాన్ని అప్పుల ఉబిలోకి నెట్టారని ఆరోపించారు . ఓ వైపు జగన్ చేసిన అప్పులు తీర్చుతూ..మరో వైపు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని , పింఛను రూ. 4 వేలకు పెంచామని, దీపం గ్యాస్ సిలిండర్లకి ముందుగానే డబ్బులు ఇస్తున్నామని, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం జూన్ నెలలో అమలు చేస్తామని తెలిపారు. బ్లూ మీడియా అసత్య ప్రచారాలు ప్రజలు నమ్మొద్దని అన్నారు. గత ఐదేళ్లు పొగాకు రైతులను గాలికొదిలేసిన వైసిపి ప్రభుత్వం నేడు రైతుల్ని రెచ్చగొట్టడం సిగ్గుచేటని అన్నారు. కొండపి నియోజకవర్గంలో ఇప్పటికే రూ.50 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులు చేసామని, రామతీర్థం నుంచి కొండపి నియోజకవర్గానికి తాగునీటి పథకం కోసం రూ . 450 కోట్లతో ప్రతిపాదనలు పంపామని తెలిపారు. నరేగా నిధులతో ప్రతి పంచాయతీలో డొంక రోడ్లు నిర్మిస్తామని అన్నారు. సిసి రోడ్లు, మినీ గోకులాల బిల్లులు జూన్ నెల నాటికి చెల్లింపులు చేస్తామని చెప్పారు. పీఎంజేఏవై కింద 70 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి రూ. ఐదు లక్షల ఉచిత వైద్య సౌకర్యం కల్పిస్తున్నామని, మన మిత్ర వాట్సాప్ ద్వారా ప్రజలకు సులభంగా సేవలందిస్తున్నామని, ప్రజా సంక్షేమ పరమావధిగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలన సాగిస్తున్నారని మంత్రి డా. డోలా బాల వీరాంజ నేయస్వామి స్పష్టం చేశారు. మరి టైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య సైతం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఆరు మండలాల టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



