7వ తేదీన జరగనున్న పవిత్ర బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణంలో ప్రశాంతంగా జరిగేలా అన్నీ చర్యలు చేపట్టాలని జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, అధికారులను ఆదేశించారు.
శుక్రవారం ఉదయం కలెక్టరేట్ లోని తన చాంబర్ లో జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, అధికారులతో సమావేశమై పవిత్ర బక్రీద్ పర్వదినం సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలు, చేపట్టవలసిన వసతులపై సమీక్షించి తగు సూచనలు, ఆదేశాలు జారిచేశారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ గోవధ నిషేధ చట్టం 1977 కచ్చితంగా అమలు చేయడంతో పాటు బక్రీద్ పర్వదినం సందర్భంగా జంతువుల అక్రమ రవాణా మరియు జంతు వధ నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా జంతువధ శాలల వద్ద ప్రభుత్వం సూచించిన నియమ నిబంధనలను ప్రతి ఒక్కరు తప్పక పాటించాలన్నారు. స్లాటర్ హౌస్ ల వద్ద శానిటేషన్, మంచినీటి సరఫరా చేయాలని, అలాగే అంతరాయం లేని నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే ఎక్కడా ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీస్, రెవిన్యూ యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ ఆచారాల వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన పెంచుకుని, బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణంలో ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు
ఈ సమావేశంలో ఒంగోలు, కనిగిరి ఆర్దిఒలు లక్ష్మి ప్రసన్న, కేశవర్ధన్ రెడ్డి, జిల్లా మైనారిటీ వెల్ఫేర్ అధికారి జి పార్ధసారధి, డిటిసి సుశీల, పోలీసు, మునిసిపల్ కమీషనర్లు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

