పాకాల బీచ్ వద్ద బే వాచ్ టవర్ ను ప్రారంభించిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా డోలా బాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ.ఆర్ దామోదర్ – సింగరాయకొండ తీరంలో ప్రమాదాల నివారణకు వాచ్ టవర్ ఏర్పాటు

ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ మండలంలోని పాకాల బీచ్ వద్ద ఇటీవల జరిగిన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని, పర్యాటకుల ప్రాణభద్రతకు బీచ్ వద్ద రూ.15 లక్షల రూపాయలతో నిర్మించిన బే వాచ్ టవర్ ను ఆదివారం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా డోలా బాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా , జిల్లా ఎస్పీ ఏ.ఆర్ దామోదర్ , జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ ప్రారంభించారు. వాచ్ టవర్ ద్వారా సముద్రతీరంలో భద్రతా అంశాలను పర్యవేక్షించటం, నీటి ప్రవాహాల ఉదృతిని గుర్తించటం, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందన వంటి చర్యలకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది.
మంత్రి మాట్లాడుతూ…. “ప్రతి పర్యాటకుడు సురక్షితంగా ఇంటికి తిరిగి వెళ్లే విధంగా ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. పర్యాటకులను అప్రమత్తం చేయటానికి బే వాచ్ టవర్ ఉపయోగపడుతుందన్నారు. సింగరాయకొండ, పాకాల బీచ్ ప్రాంతాల్లో గతంలో కొన్ని దుర్ఘటనలు జరిగాయని, వాటిని పునరావృతం కాకుండా నిరోధించేందుకు వాచ్ టవర్ ఏర్పాటు చేయడం జరిగింది. జాతీయ జెండా, సింహతలాటం మొదటి సారిగా నిర్మించటం జరిగిందన్నారు. పోలీస్ మరియు కోస్టల్ గార్డ్ సిబ్బంది సమన్వయంతో విధులు, తీరప్రాంత భద్రతపై మరిన్ని చర్యలు మరియు అవగాహన కల్పించాలన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. పాకాల బీచ్ ప్రస్తుతం జిల్లాలో ఒక ప్రముఖ పర్యాటక ప్రాంతమని, ఇలాంటి ప్రదేశాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడమే కాక, పర్యాటకుల భద్రతా పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడం అవసరమన్నారు. ఈ వాచ్ టవర్ ద్వారా సముద్రపు ప్రవాహాలు, కెరటాల ఉధృతి వంటి పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం అందుతుందని అన్నారు. ప్రమాదాలను ముందే గుర్తించి, రక్షణ చర్యలు తీసుకోవడం సాధ్యమవుతుందని తెలిపారు.

జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, పర్యాటకులు ఎక్కువగా వచ్చే పాకాల బీచ్ వంటి ప్రదేశాల్లో గతంలో కొన్ని విషాదకరమైన ఘటనలు చోటుచేసుకోవడంతో పలు భద్రతా చర్యలు తీసుకోవటం జరిగిందని, బీచ్ పరిసర ప్రాంతాల్లో పికెటింగ్, పెట్రోలింగ్ జరుగుతోందని, వాచ్ టవర్ ద్వారా సముద్రపు పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుని, పోలీస్ లు తక్షణ చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. తీర ప్రాంతాల్లో భద్రతకు పోలీస్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నమని, సీసీ కెమెరాలు, హెచ్చరిక బోర్డులు, మరియు ఎమర్జెన్సీ స్పందన యంత్రాంగాన్ని మరింతగా మెరుగుపరుస్తామన్నారు. పర్యాటకులు తమ భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, పిల్లలను కనీసం పెద్దల పర్యవేక్షణలో ఉండేలా చూడాలన్నారు.

బే వాచ్ టవర్ నిర్మాణంలో మరియు అత్యాధునికమైన టెక్నాలజీ సీసీ కెమెరాలు, పబ్లిక్ అడ్రెస్సింగ్ సిస్టం మరియు టైం క్లాక్ అనౌన్స్ సిస్టమును ఏర్పాటు చేసినందుకు సింగరాయకొండ సిఐ సిహెచ్ హాజరత్తయ్య, మరియు ఎస్ఐ మహేంద్రను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ , ఆర్ డి ఓ లక్ష్మీ ప్రసన్న , ఎఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు, సింగరాయకొండ సిఐ హాజరత్తయ్య, కోస్టల్ సెక్యూరిటీ సీఐ శివన్నారాయణ, ఆర్ఐలు రమణారెడ్డి, సీతారామిరెడ్డి, సింగరాయకొండ ఎస్సై మహేంద్ర, టంగుటూరు ఎస్సై నాగమలేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *