టిడ్కో ఇళ్లకు సంబంధించిన పెండింగ్ పనులను పూర్తి చేసి దీపావళి నాటికి లబ్ధిదారులకు వాటిని అందిస్తామని రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మాత్యులు పి.నారాయణ
తెలిపారు. ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన కార్యకలాపాలపై సమీక్షించేందుకు శుక్రవారం ఆయన ఒంగోలు వచ్చారు. ప్రకాశం భవనంలో జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ, మార్కాపురం శాసనసభ్యులు కె.నారాయణ రెడ్డి, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణలతో కలిసి మంత్రి సమీక్షించారు. అనంతరం సంబంధిత వివరాలను విలేకరుల సమావేశంలో ఆయన వివరించారు.
టిడ్కో ఇళ్లను 300, 365, 430 చదరపు అడుగుల విస్తీర్ణమైనవిగా మూడు కేటగిరీలుగా చేపట్టినట్లు చెప్పారు. వీటిలో 365, 430 చదరపు అడుగుల ఇళ్లను ముందుగా పూర్తిచేసి దీపావళి నాటికి లబ్ధిదారులకు అందిస్తామని ప్రకటించారు. గత ప్రభుత్వంలో ఇల్లు ఇవ్వకపోగా లబ్ధిదారుల పేరుతో బ్యాంకు లోన్ రైజ్ చేసిందని, ఈ రుణం రీపేమెంట్ కాకపోవటం వలన బ్యాంకు ఖాతాలు ఎన్.పీ. అయ్యాయని, ఈ విషయాన్ని బ్యాంకర్లు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు బ్యాంకర్లకు రూ.140 కోట్లను చెల్లించామన్నారు. తద్వారా లబ్ధిదారులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు వచ్చినట్లు మంత్రి తెలిపారు. ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేసే ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైందని, ప్రకాశం జిల్లాలో మరో 15 రోజుల్లో ఎల్ అండ్ టి సంస్థ ప్రతినిధులు నిర్మాణ పనులను చేపడతారని ఆయన వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా మిగిలిపోయిన 85 లక్షల టన్నుల చెత్తను అక్టోబర్ రెండో తేదీ నాటికి రీసైకిల్ చేసేలా చర్యలు చేపట్టామన్నారు. ఇప్పటికే 40 లక్షల టన్నుల చెత్తను ప్రాసెస్ చేసినట్లు తెలిపారు. నాలుగేళ్లలో రాష్ట్రంలోని ప్రతి ఇంటికి కొళాయి ద్వారా రక్షిత మంచినీటిని సరఫరా చేస్తామన్నారు. బోర్లు నుండి కాకుండా నదుల వంటి ఉపరితల నీటి వనరుల నుంచి సరఫరా చేస్తామన్నారు. ఈ దిశగా టెండర్లు పిలిచినట్లు మంత్రి తెలిపారు. మున్సిపాలిటీలలో తాగునీటితోపాటు పారిశుద్ధ్యము, రోడ్లు, డ్రైనేజీలు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. ఒంగోలులో రోడ్ విస్తరణ వలన నష్టపోయే వారికి టిడిఆర్ బాండ్స్ ఇస్తామని ప్రకటించారు.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ అపార అనుభవంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గాడిలో పెడుతున్నట్లు తెలిపారు. ప్రజల సంక్షేమానికీ, అభివృద్ధికీ ప్రభుత్వం సమ ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. అధికారం చేపట్టిన వెంటనే హామీల అమలుపై దృష్టి పెట్టామన్నారు. సంక్షేమ పెన్షన్లు, మహిళలకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం వంటి పథకాలను ఇప్పటికే అమలు చేశామని మంత్రి చెప్పారు. ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కూడా కల్పిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించినట్లు గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ రైతులకు ఆర్థిక సహాయం చేయటానికి చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. పేదల ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించామని, వీటిలో రెండు లక్షల 25 వేల మంది భోజనం తింటున్నట్లు మంత్రి చెప్పారు. ఈ దృష్ట్యా గ్రామీణ ప్రాంతాల్లోనూ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయబోతున్నట్లు వివరించారు. రాష్ట్రానికి పరిశ్రమలు తీసకొచ్చి హామీ ఇచ్చినట్లుగా 20 లక్షల ఉద్యోగాలు కల్పించడానికి కట్టుబడి ఉన్నామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.
ఈ సమీక్ష సమావేశంలో ఒంగోలు మున్సిపల్ కమిషనర్ కె.వెంకటేశ్వరరావు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు పాల్గొన్నారు.

