మహిళలు అన్ని రంగాల్లోనూ ముందడుగు వేసేలా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంది – జిల్లా కలెక్టర్ (ఇన్చార్జి) ఆర్.గోపాలకృష్ణ

   
       మహిళలు అన్ని రంగాల్లోనూ ముందడుగు వేసేలా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉందని జిల్లా
కలెక్టర్ (ఇన్చార్జి) ఆర్.గోపాలకృష్ణ చెప్పారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) లోని రిసోర్స్ పర్సన్స్ (ఆర్.పీ)కు 164 ట్యాబులు మరియు  డిజీ లక్ష్మిలకు 100 బయోమెట్రిక్ పరికరాలను శనివారం ప్రకాశం భవనంలోని గ్రీవెన్స్ హాలులో పంపిణీ చేశారు.  మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ పి. శ్రీహరి  అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, ఆస్టర్ రమేష్ ఆసుపత్రి ఒంగోలు బ్రాంచ్ సీఈవో డాక్టర్ అల్లూరి నితిన్, గైనకాలజీ డాక్టర్ ప్రతిమ పాల్గొన్నారు. రిసోర్స్ పర్సన్లు తమ గ్రూపులకు సంబంధించిన వివరాలు, లావాదేవీలను పుస్తకాలలో కాకుండా నేరుగా ఈ ట్యాబ్ లలో నమోదు చేయాల్సి ఉంటుందని మెప్మా పీ.డి. చెప్పారు. తద్వారా ఆ వివరాలు ముఖ్యమంత్రి డాష్ బోర్డుకు అనుసంధానం అవుతాయన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

రాష్ట్రంలోనే తొలిసారిగా…

            ఆస్టర్ రమేష్ యాజమాన్యం మరియు మెప్మా మధ్య ఈ కార్యక్రమంలో ఒక ప్రత్యేక అవగాహన ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం మెప్మా మహిళలకు అన్ని మున్సిపాలిటీలలో ప్రత్యేక ఉచిత వైద్య శిబిరాలను ఆస్టర్ రమేష్ ఆసుపత్రి వైద్యులు  నిర్వహిస్తారు. చికిత్స అవసరమైన వారికి ఆయా కేసులను బట్టి 20 శాతం వరకు ఫీజులో రాయితీ ఇస్తారు. మెప్మా మహిళల కుటుంబ సభ్యులు  చదువుకున్నట్లయితే వారి అర్హతను బట్టి తమ ఆసుపత్రిలో ఉద్యోగ అవకాశాలను కూడా కల్పిస్తారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ప్రకాశం జిల్లాలో ఒక ప్రైవేటు ఆసుపత్రితో ఈ తరహా ఒప్పందం జరిగింది.

మా అమ్మ కూడా ఎస్. హెచ్. జి. లీడర్…

        ఈ సందర్భంగా కలెక్టర్ గోపాలకృష్ణ మాట్లాడుతూ తన తల్లి కూడా స్వయం సహాయక సంఘ (ఎస్ .హెచ్. జి.) లీడర్ అని చెప్పారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగానూ సాధికారత సాధించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం 20 ఏళ్ల క్రితమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకున్నారని ఆయన గుర్తు చేశారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మహిళలు అన్ని రంగాల్లోనూ ముందడుగు వేసేలా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటున్నట్లు తెలిపారు.
గౌరవము … గుర్తింపు…

             మహిళలకు గౌరవంతో పాటు ప్రత్యేక గుర్తింపు కూడా ఉండాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు చెప్పారు. ఎన్.టి రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మహిళలకు ఆస్తిలో వాటా వచ్చేలా చర్యలు తీసుకున్నట్లు గుర్తు చేశారు. అనంతరం మహిళల ఆర్థిక స్వావలంబన కోసం నారా చంద్రబాబు నాయుడు కృషి చేశారని చెప్పారు. ఆయన కృషికి నిదర్శనమే నేడు స్వయం సహాయక సంఘాల మహిళల విజయాలు అని వ్యాఖ్యానించారు. ఎస్ హెచ్ జి మహిళలు 10 మందికి ఉపయోగపడేలా ఉండాలని, జిల్లాను అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకువెళ్లాలని ఆయన సూచించారు. తద్వారా సమాజంలో ఎస్ హెచ్ జి మహిళకు గౌరవం పెరుగుతుందన్నారు. పీ -4 పథకం  కింద లబ్ధి పొందేందుకు ఒంగోలు నియోజకవర్గంలో 10,700 బంగారు కుటుంబాలను గుర్తించినట్లు చెప్పారు. ఆయా కుటుంబాలు అన్ని విధాల అభివృద్ధి చెందేలా మెప్మా ఆర్పీలు తమ వంతు సహకారం అందించాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా పనిచేయాలని ఎమ్మెల్యే చెప్పారు. విద్యార్థులు దుర్వ్యసనాలకు బానిసలు కాకుండా చదువుకునేలా విద్యా వ్యవస్థలో పలు మార్పులు తీసుకువచ్చి  రాష్ట్ర ప్రభుత్వం బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. నూతన యూనిఫారం, మెరుగ్గా తల్లికి వందనం,  నాణ్యమైన భోజనం వంటివి ఇందులో భాగమేనని తెలిపారు. ఆయా బంగారు కుటుంబాలకు ప్రభుత్వం తరఫునుంచి, అదేవిధంగా మార్గదర్శకుల నుంచి కూడా అందే అవకాశం ఉన్న సహాయాన్ని వివరించాలని అన్నారు. ఒక్కొక్కటి సుమారు 30 వేల రూపాయల విలువైన ట్యాబ్ ను ఆర్.పీ. లకు ప్రభుత్వం అందిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా డిగ్రీ విద్యార్హత కలిగిన డిజి లక్ష్మి లకు కూడా కామన్ సర్వీస్ సెంటర్లు ( సి .ఎస్. సి) లు మాదిరిగా సేవలు అందిస్తూ మరింత ఆదాయం పొందేలా బయోమెట్రిక్ పరికరాలను కూడా ఇస్తున్నామన్నారు. టెక్నాలజీని అందిపుచ్చుకొని పనిచేయాలని ఆర్. పి. లకు ఆయన పిలుపునిచ్చారు. ఎలాంటి సహకారం  కావాలన్నా వ్యక్తిగతంగా తాను అండగా ఉంటానని,  ప్రభుత్వం నుంచి కూడా అవసరమైన సహాయం అందేలా చూస్తానని మెప్మా కు ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.

             డాక్టర్ అల్లూరి నితిన్ మాట్లాడుతూ తమ ఆసుపత్రి ద్వారా అందించే వైద్య సదుపాయాలను, రాయితీల వివరాలను వెల్లడించారు. ఆరోగ్యం పట్ల,  ముఖ్యంగా మహిళలకు వచ్చే సమస్యల పట్ల తీసుకోవలసిన జాగ్రత్తల గురించి డాక్టర్ ప్రతిమ ఈ సందర్భంగా అవగాహన కల్పించారు.

          ఈ కార్యక్రమంలో మెప్మా ఐ.బి. ఫణి కుమారి,
బి.ఎల్ . రాణి, ఏవో వినీల్ కుమార్, మెప్మా జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు భారతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *