నాసిరకం మద్యం అమ్మకాల ద్వారా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన జగన్ అండ్ కో విషయంలో చట్టం తన పని తాను చేస్తుందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో సోమవారం జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు – ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. పట్టణంలోని 36వ డివిజన్ లో ఇంటింటికీ వెళ్లిన మంత్రి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్నసంక్షేమ పథకాల అమలు తీరును లబ్ధిదారులకు వివరించారు. స్థానిక వెంకటేశ్వర కాలనీలో రూ.4.80 కోట్లతో నిర్మించిన 33\11 కేవీ సబ్ స్టేషన్ ను మంత్రి ప్రారంభించారు. హౌసింగ్ బోర్డ్ కాలనీలో రూ.3.80 కోట్లతో నిర్మించనున్న 33\11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ కు, రూ.10.50 కోట్లతో చేపట్టబోయే ఆర్డీఎస్ఎస్ పనులకు మంత్రి గొట్టిపాటి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మాట్లాడుతూ… వైసీపీ ప్రభుత్వ హయాంలో నాసిరకం మద్యంతో ప్రజలను మోసం చేసి, వారి ప్రాణాలు గాల్లో కలిసేలా చేశారని విమర్శించారు. డిజిటల్ చెల్లింపులు లేకుండా పెద్ద మొత్తంలో ప్రజా ధనాన్నిలూటీ చేశారని మండి పడ్డారు. లిక్కర్ స్కాం దోషులు ఎంతటి వారైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలకు నష్టం కలిగించిన బాధ్యులందరికీ తప్పకుండా శిక్ష పడుతుందని స్పష్టం చేశారు. లిక్కర్ స్కాం కేసులో సూత్రధారులు, పాత్రధారులు ఎవరూ కూడా తప్పించుకోలేరని మంత్రి గొట్టిపాటి వివరించారు.
వ్యాపార, పారిశ్రామిక సంస్థల అవసరాల కోసమే స్మార్ట్ మీటర్లను బిగిస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లను బిగించేది లేదని తేల్చి చెప్పారు. స్మార్ట్ మీటర్ బిగింపుతో అధిక బిల్లులు వస్తున్నాయనే ప్రచారాన్ని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ కొట్టిపారేశారు. కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. స్మార్ట్ మీటర్ల వినియోగంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైతే.. ప్రభుత్వం బాధ్యత తీసుకుని పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపారని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ విమర్శించారు. అస్తవ్యస్తమైన విద్యుత్ శాఖను కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత గాడిలో పెడుతున్నామన్నారు. లో ఓల్టేజ్ సమస్యలను పరిష్కరించేందుకు రూ.6 వేల కోట్లతో పనులు చేపట్టినట్లు వివరించారు.
వైసీపీ నేతలు విద్యా వ్యవస్థలోనూ రాజకీయాలకు పాల్పడి భ్రష్టు పట్టించారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆరోపించారు. విద్యార్థులకు ఇచ్చే బ్యాగులు, పుస్తకాలపై జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేస్తూ నాణ్యతలేని వస్తువులను పంపిణీ చేశారని మండిపడ్డారు. మంత్రి లోకేష్ విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నారని తెలిపారు. అనేక సంస్కరణలు ప్రవేశ పెట్టి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు కృషి చేస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఒకే రోజు తల్లికి వందనం పథకంలో భాగంగా రూ.10,000 కోట్లను తల్లుల ఖాతాల్లో జమ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదే అన్నారు. నాణ్యమైన యూనిఫామ్ లు, పుస్తకాలు, బ్యాగులు విద్యార్థులందరికీ సరఫరా చేసినట్లు మంత్రి గొట్టిపాటి వెల్లడించారు. రాజకీయలకు, నాయకులకు సంబంధం లేకుండా విద్యార్థులకు విద్యను మాత్రమే అందించే లక్ష్యంతో వారికి సామాగ్రి అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్, సంతనూతలపాడు ఎమ్మెల్యే బీ.ఎన్ విజయ్ కుమార్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
