ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న పీ – 4 పథకంలో అధికారులు, ప్రజాప్రతినిధులు చురుకైన పాత్ర పోషించాలని రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం అమరావతి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, శాసనసభ్యులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ విషయంలో ప్రతి నియోజకవర్గానికి, ఎమ్మెల్యేకి వారాంతపు రేటింగ్ ఇస్తానని చెప్పారు. ఈ పథకం అమలు ద్వారా సమాజంలో వస్తున్న మార్పును ప్రతి మూడు నెలలకు ఒకసారి మదింపు చేయిస్తానని ప్రకటించారు. తాను కూడా 250 బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తెలిపారు. ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక హ్యాండ్ బుక్కును ముద్రించిందన్నారు. మార్గదర్శకులకు ఉన్న అపోహలను తొలగించేలా సమగ్ర వివరాలను ఇందులో పొందుపరిచినట్లు చెప్పారు. సేవా దృక్పథంతో ముందుకు వచ్చేలా మార్గదర్శకులలో ప్రేరణ నింపాలన్నారు. అయితే ఈ విషయంలో ఎలాంటి నిర్బంధం లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈనెల 15వ తేదీ నాటికి మార్గదర్శకులను పూర్తిస్థాయిలో గుర్తించి, 19వ తేదీన ఈ పథకాన్ని ప్రారంభిస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా పలువురు శాసనసభ్యులు తమ నియోజకవర్గాల్లో చేపట్టిన చర్యలను వివరించగా ముఖ్యమంత్రి అభినందించారు. వారు చేసిన సూచనలను ఆయన పరిగణనలోకి తీసుకున్నారు.
అనంతరం, అధికారులతో కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ప్రత్యేకంగా చర్చించారు. జిల్లాలో మొత్తం 74,911 బంగారు కుటుంబాలను గుర్తించగా, 6350 మార్గదర్శకులను 37389 కుటుంబాలకు అనుసంధానం చేసామన్నారు. మిగతా బంగారు కుటుంబాల కోసం మార్గదర్శకులను త్వరగా గుర్తించాలని చెప్పారు.
ఈ సమావేశంలో మార్కాపురం సబ్ కలెక్టర్ సహదిత్ వెంకట త్రివినాగ్, డిఆర్ఓ బి.చిన ఓబులేసు, జడ్పీ సీఈవో చిరంజీవి, ఒంగోలు ఆర్డిఓ లక్ష్మీ ప్రసన్న, కొండపి నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ శ్రీధర్ రెడ్డి, సిపిఓ స్వరూప రాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
