ఈ నెల 27వ తేదీ నుండి ప్రారంభమయ్యే వినాయక చవితి వేడుకల నేపధ్యంలో, భక్తులు పాటించాల్సిన నియమ నిబంధనలు మరియు తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తలపై జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ పలు సూచనలు చేశారు. వినాయక చవితి వేడుకలలో భాగంగా పందిళ్లు/మండపాలు ఏర్పాటు చేయాలనుకునే వారు తప్పనిసరిగా పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాలన్నారు.
వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక మంటపం ఏర్పాటు చేయు ప్రజల కోసం పోలీస్ శాఖ ప్రత్యేకంగా సింగిల్ విండో సిస్టం ద్వారా గణేష్ ఉత్సవాలకు అనుమతులను వెబ్సైట్ లో గణేష్ మంటపం ఏర్పాటు చేయదలచిన కమిటి సభ్యుల వివరాలు, మంటపం ఏర్పాటు చేయు ప్రదేశం, ఏ పోలీసు స్టేషన్ పరిధిలోకి వస్తుంది, విగ్రహం ఎత్తు, మంటపం ఎత్తు, విగ్రహ ప్రతిష్ఠ ఏ రోజు జరుగుతుంది, నిమజ్జనం ఎక్కడ ఏ సమయంలో చేస్తారు, ఏ వాహనం ద్వారా నిమజ్జనం చేస్తారు వంటి వివరాలను నమోదు చేసి దరఖాస్తు చేసుకోవాలి. ఈ అనుమతులు పొందడానికి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఆన్ లైన్ లో దరఖాస్తు సంబంధిత పోలీసు స్టేషన్ ఎస్.హెచ్.ఓ కి సమర్పించబడుతుందని తెలిపారు.
ఎస్ హెచ్ ఓ తనిఖీ చేసి ఏర్పాటు సురక్షితంగా మరియు నిబంధనలకు అనుగుణంగా ఉన్నట్లుగా తేలితే, నిరభ్యంతర పత్రాన్ని జారీ చేస్తారని తెలిపారు. ఈ పత్రాన్ని ప్రింట్ చేసి గణేష్ మంటపంలో ఉంచాలి. గణేష్ ఉత్సవాలు నిర్వహించే కమిటీ నిర్వాహకులు గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ ( ganeshutsav.net )వెబ్సైట్ సేవలు వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. వినాయక ఉత్సవాలను శాంతియుతంగా, భద్రతా పరమైన నియమ నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలని, పబ్లిక్ ప్రదేశాలలో అనుమతి లేకుండా వినాయక మండపాలు/పందిళ్లు ఏర్పాటు చేయవద్దని, సింగిల్ విండో విధానం ద్వారా సులభంగా అనుమతులు పొందాలని ప్రజలకు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు మట్టి గణేశులను మాత్రమే ప్రతిష్ఠించాలి.
*వినాయక చవితి వేడుకల సందర్భంగా పాటించాల్సిన నియమ నిబంధనలు మరియు తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తలు* ఎలా ఉన్నాయి…
👉గణేష్”విగ్రహ ప్రతిష్ఠ, పందిళ్ళు/మండపాలు ఏర్పాటు చేసుకోవడానికి ముందస్తుగా ఒక కమిటీని ఏర్పాటుచేసి, ఆ కమిటీదే అన్ని బాధ్యతలని స్పష్టంగా గుర్తించాలి.
👉పంచాయతీ/మున్సిపాలిటీ/ నగర పాలక సంస్థ లేదా ప్రయివేట్ స్థలాలలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకుంటే సంబంధిత స్థల యజమాని లేదా సంబంధిత విభాగపు అధికారుల అనుమతి తప్పనిసరి.
👉ఫైర్, విద్యుత్ శాఖల విభాగాలు సూచించిన నియమ నిబంధనలకు అనుగుణంగా పందిళ్ళు/మంటపాలు వద్ద అగ్ని ప్రమాదాలు తలెత్తకుండా నివారించడానికి మంటపంలో తగినంత ఇసుక, నీళ్ళ మరియు ఫైర్ ఎక్స్టింగ్విషర్లు (అగ్ని మాపక పరికరాలు) ఉండాలి.
👉పందిళ్లు లేదా మండపాలలో అగ్నిప్రమాదాలు సంభవించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా విద్యుత్ వైర్లు మరియు ప్రకాశవంతమైన లైట్ల వినియోగంలో అప్రమత్తంగా ఉండాలి. ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ జరగకుండా, వైరింగ్‌ను నిపుణుల ద్వారా సురక్షితంగా చేయించుకోవాలి.
👉 వినాయక చవితి మండపాల వద్ద అధిక శబ్ద కాలుష్యాన్ని కలిగించే స్పీకర్లు వినియోగించకూడదు. స్పీకర్లు ఉదయం 6:00 గంటల నుంచి రాత్రి 10:00 గంటల వరకే వినియోగించాలి.
👉మైకు లో ఎవరైనా కించపరిచే విధంగా వాక్యాలు చేయటం గాని, రెచ్చగొట్టి ప్రజాశాంతికి భంగం కలిగించే విధంగా ప్రచారం చేయరాదు.
👉 విద్యాసంస్థలు, ఆసుపత్రులు, దేవాలయాలు/చర్చిలు/మసీదులు (ప్రత్యేక స్థలాల వద్ద), పోలీస్ స్టేషన్లు లేదా ఇతర ప్రభుత్వ కార్యాలయాల వద్ద మైక్ ద్వారా ఎటువంటి ప్రచారమూ చేయరాదు.
👉 రాత్రి వేళలలో మండపాల వద్ద నిర్వహణ కమిటీ ప్రతినిధులు విధిగా కాపలా ఉండాలి. భద్రతా దృష్టితో, ప్రతి మండపం తమకు తగిన భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలి. రాత్రి సమయాలలో పందిళ్లు/మంటపాలలో విలువైన వస్తువులు ఉంచకూడదు.
👉ఉత్సవాలు జరుగుతున్న ప్రదేశంలో కమిటీ సభ్యులు ఎప్పుడూ అందుబాటులో ఉండాలి. భద్రతా పరిరక్షణ కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి.
👉వినాయక పందిళ్లు లేదా విగ్రహాలను రోడ్డుపైన ఏర్పాటు చేయరాదు. బ్యానర్లు లేదా ప్లెక్సీలు రాకపోకలకు అంతరాయంగా రోడ్లపై ఉంచకూడదు. వినాయక చవితి ఉత్సవాల సమయంలో బాణసంచా వాడకూడదు.
👉 పందిళ్ల వద్ద మరియు ఊరేగింపు సమయంలో అనుచిత ప్రదర్శనలు, అసభ్య నృత్యాలు జరగకుండా ఉండే విధంగా ఉత్సవ నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మరియు బాధ్యత వహించాలి.
👉ఊరేగింపు సమయంలో పోలీసుల అనుమతి లేకుండా వేషధారణలు, ఎక్కువ శబ్ధము వచ్చే వాయిద్యాలు అనగా డి.జే., తదితరాలకు అనుమతి ఉండదు.
👉 నిమజ్జన ఊరేగింపుకు అనుమతించిన సమయం, నిమజ్జనకు కేటాయించిన ప్రదేశం, అలాగే ఊరేగింపుకు కేటాయించిన మార్గాలలో నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి.
👉 ఊరేగింపు సమయంలో ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా, రద్దీ తగ్గించేందుకు మరియు భద్రత కోసం తగినంత మంది కమిటీ సభ్యులు, ఉత్సవ నిర్వాహకులు ఏర్పాటు చేసుకోవాలి.
వినాయక చవితి పర్వదినం, ఉత్సవాల నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ గారు పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గణేష్ ప్రతిమలు ఏర్పాటు చేసిన మంటపాలు, ఇతర ప్రదేశాల్లో భద్రతాపరమైన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని, పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని ఆదేశించారు. నిమజ్జనం జరిగే ప్రదేశాలు, సంబంధిత ప్రాంతాల్లో కరెంట్ సౌకర్యం, గజ ఈతగాళ్లు, వైద్య సిబ్బంది, మంటలను ఆర్పే వస్తువులు తదితరాలను సిద్ధం చేసుకోవడానికి రెవెన్యూ, పంచాయతీ, మున్సిపాలిటీ విభాగాలతో సమన్వయం చేసుకుని ఎలాంటి ఇబ్బంది కలగకుండా వేడుకలు ప్రశాంతంగా ముగిసేలా ముందస్తు చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
