సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యాలయాలు, హాస్టళ్ళలో ఉంటున్న విద్యార్థులకు మంచి విద్య, భోజనము, వసతితోపాటు వారి ఆరోగ్యంపైనా మరింత దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా
స్పష్టం చేశారు. గురువారం వివిధ సంక్షేమ శాఖల ఉన్నతాధికారులతో తన క్యాంపు కార్యాలయంలో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రెసిడెన్షియల్ విద్యాలయాలతో పాటు హాస్టళ్లలో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు – ఖాళీలు, మౌలిక సదుపాయాలు, సొంత – అద్దె భవనాలు, వాటిని ఉన్నతాధికారులు తనిఖీ చేస్తున్న తీరు, విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న విధానం, ఆహార నాణ్యత, మెనూ అమలు – సమస్యలు, తదితర వివరాలపై కలెక్టర్ చర్చించారు. సంబంధిత శాఖల ఉన్నతాధికారులు హాస్టళ్ళను తనిఖీ చేసిన వివరాలను ప్రతి వారం తనకు నివేదించాలని ఆమె ఆదేశించారు. ఆయా హాస్టళ్ళను నియోజక వర్గాల స్పెషల్ ఆఫీసర్లకు ట్యాగ్ చేస్తే వారు కూడా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారని చెప్పారు. ఆరోగ్య సమస్యలను విద్యార్థులు ప్రస్తావించినప్పుడు తేలికగా తీసుకోకుండా నిబంధనల ప్రకారం వారికి వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ఆమె స్పష్టం చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరిగితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హెచ్చరించారు. హాస్టళ్ళ స్థాయిలోనే పరిష్కారం అయ్యే సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తే ఊరుకోనని చెప్పారు. హాస్టళ్ళలో పారిశుద్ధ్యము, ప్లాంటేషన్, వర్షపు నీటిని భూమిలోకి ఇంకింపచేసేలా నిర్మాణాలపై దృష్టి పెట్టాలన్నారు. ఈ విషయంలో సంబంధిత ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవాలని కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. పదో తరగతి విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ గైడ్లు త్వరగా వచ్చేలా తాను చూస్తానని, లెక్కలు, సైన్స్ పాఠ్యాంశాలను బోధించేందుకు టూటర్లను కూడా పూర్తిస్థాయిలో నిర్మించుకోవాలని అధికారులకు ఆమె చెప్పారు.
ఈ సమావేశంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మానాయక్, బీసీ సంక్షేమ అధికారి నిర్మల జ్యోతి, గిరిజన సంక్షేమ అధికారి వరలక్ష్మి, దివ్యాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు సువార్త, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల జిల్లా సమన్వయ అధికారి జయ, కేజీబీవీ జి సి డి ఓ హేమలత, ఆయా శాఖల నియోజకవర్గ స్థాయి అధికారులు పాల్గొన్నారు.

