పౌరుషం, త్యాగం, ప్రతిభకు ప్రతీకగా నిలిచిన టంగుటూరి ప్రకాశం పంతులు నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాలకృష్ణ
పిలుపునిచ్చారు. ఆంధ్ర కేసరి 154వ జయంతిని పురస్కరించుకుని శనివారం దేవరంపాడులోని స్థూపం వద్ద నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ప్రకాశం పంతులు, మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. అనంతరం జాతీయ జెండాను ఆయన ఎగురవేశారు. ఈ సందర్భంగా స్థానికులను ఉద్దేశించి జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ … దమ్ముంటే కాల్చాలంటూ బ్రిటిష్ వారి తుపాకులకు ఎదురు నిలిచిన ధీశాలి ప్రకాశం పంతులు అని కొనియాడారు. స్వాతంత్ర్య సమరయోధునిగా,
ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రకాశం పంతులు తనదైన ముద్ర వేశారని ఆయన అన్నారు. అంతటి గొప్ప వ్యక్తి, త్యాగశీలి అయిన ప్రకాశం పంతులు గారి జయంతిని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. సవాళ్లకు ఎదురొడ్డి ధైర్యంగా ముందుకు సాగిన ప్రకాశం పంతులు నేటి యువత స్ఫూర్తిగా తీసుకొని, తాము ఎంచుకున్న రంగంలో విజేతలుగా నిలవాలని జాయింట్ కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ స్మారకం వద్ద రెండు ఎకరాల విస్తీర్ణంలో డ్వామా ఆధ్వర్యంలో పల్లెవనం ఏర్పాటు చేయిస్తామని ఆయన ప్రకటించారు. స్థూపం చుట్టూ పెండింగ్ లో ఉన్న ప్రహరీ గోడ నిర్మాణాన్ని కూడా త్వరలో పూర్తి చేయిస్తామని తెలిపారు.
మాల కార్పొరేషన్ చైర్మన్ పి.విజయ్ కుమార్ మాట్లాడుతూ ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేలా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి దృష్టికి తీసుకు వెళతానని చెప్పారు.
ఈ కార్యక్రమంలో డిపిఓ గొట్టిపాటి వెంకట నాయుడు, డ్వామా పిడి జోసఫ్ కుమార్, ఒంగోలు ఆర్డిఓ లక్ష్మీ ప్రసన్న, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్, పలువురు మండల స్థాయి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

