ప్రజాస్వామ్యం ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది..ఏ రాజకీయ కారణంతో ఉపరాష్ట్రపతిని రాజీనామా చేయించారు…ట్రంప్ డైరెక్షన్ లో మోదీ ప్రభుత్వం…పౌరుల ఓటు హక్కు భంగం కలిగిస్తున్నారు…దేశాన్ని కాపాడాలంటే కమ్యూనిస్టు పార్టీలు బలోపేతం కావాలి…మీడియా సమావేశంలో సీపీఐ ప్రధాన కార్యదర్శి రాజా…

ఈ దేశం ఎన్నడూ లేని విధంగా ప్రజాస్వామ్యం ప్రమాదకర పరిస్థితుల్లోకి వెళ్లిపోయిందని, అందుకు ఆర్ఎస్ఎస్, బీజేపీ విధానాలే కారణమని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా అన్నారు. నేడు దేశం ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోందని, ఈ దేశాన్ని కాపాడాలంటే కమ్యూనిస్టు పార్టీలు బలోపేతం కావాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా స్పష్టం చేశారు. సిపిఐ రాష్ట్ర 28 వ మహాసభలలో రెండో రోజు ముఖ్య వక్తగా హాజరైన రాజా మహాసభ ప్రాంగణంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఏ రాజకీయ కారణంతో ఉపరాష్ట్రపతి రాజీనామా చేశారో ఎన్డీఏ ప్రభుత్వం దేశ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కొత్తగా ఎందుకు ఉపరాష్ట్రపతి ఎన్నిక నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. ఈ పదవికి ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని రాజ్యాంగ హక్కుల పరిరక్షణ నేతగా పోటీలో ఉంచామన్నారు. నేడు దేశ రాజకీయాలు చాలా ప్రమాదకర పరిస్థితిలోకి వెళ్ళిళ్లిపోతున్నాయని రాజా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు నిలయంగా ఉన్న పార్లమెంట్ లోనే అబద్ధపు మాటలు చెప్పి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారని, బ పెహల్గామ్ తీవ్రవాదుల దాడి కూడా రాజకీయం చేస్తున్నారని, ట్రంప్ చెబితేనే యుద్ధం ఆపమని మోదీ చెప్పడం సిగ్గుచేటన్నారు. కశ్మీర్ సమస్యను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పరిష్కరిస్తారా అని ప్రశ్నించారు. ట్రంప్ తో మోదీ చెలిమి దేశానికే ప్రమాదకరమన్నారు. రష్యా, భారత్ ఆర్థిక సంబంధాలు బలంగా ఉన్నాయని అందుకే మోదీని పావుగా ట్రంప్ వాడుకుంటున్నారని చెప్పారు. దేశ ప్రజల సమైక్యతా స్ఫూర్తిని దెబ్బతీసేలా ఆర్ఎస్ఎస్ ప్రయత్నం చేస్తున్న దన్నారు. విపక్షాలపై ఈడి, ఐటి పేరుతో దాడి చేసి బెదిరించి తమ గుప్పెట్లో పెట్టుకుంటున్నారని ఇది దేశ రాజకీయాలకు మంచిది కాదని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ స్వతంత్ర సంస్థగా ఉండాలని, దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తమ గుప్పెట్లో పెట్టుకుని దేశ ప్రజల ఓటు హక్కును కాలరాస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీహార్లో ఓటు హక్కు లేకుండా లక్షలాది మంది ప్రజలను చేస్తున్నారని, ఇదే తరహాలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్లో అవలంబించేందుకు కేంద్రం కుట్ర చేస్తున్న దన్నారు. సెప్టెంబర్ 1 తేదీన బీహార్ లో ఓట్ల చోరీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపడతామన్నారు. సుప్రీంకోర్టు కలుగజేసుకొని ఆధార్ కార్డు ద్వారా ఓటు పొందాలని చెప్పినా కేంద్రానికి కనువిప్పు కలగడం లేదన్నారు. దీనిపై ఇప్పటికే సిపిఐ సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేసిందని తెలిపారు. ఓటు హక్కు పొందాలంటే ఎంతమందికి బర్త్ సర్టిఫికెట్లు ఉంటాయని ప్రశ్నించారు. సామాన్య ప్రజల ఓటు హక్కును కాలరాసేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ పన్నాగానికి పాల్పడుతోందని ఇప్పుడు ఊరుకుంటే దేశమంతా ఇదే పరిస్థితి చోటు చేసుకుంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్, బీజీపి దేశ చరిత్రలో ఇలాంటి దాడికి పాల్పడుతాయని ఎవరు ఊహించలేదన్నారు. మరోపక్క దేశంలో ఆర్థిక వ్యవస్థ రోజురోజుకు దిగజారి పోతుందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు అమ్మేస్తున్నాయని అందుకు ఉదాహరణ విశాఖ స్టీల్ ప్లాంట్ అని చెప్పారు. దేశంలో రైతులు, కార్మికులు, యువత పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నారని, దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిపోతోందని ఆందోళన చెందారు. ఈ దేశాన్ని కాపాడాలంటే కమ్యూనిస్టు పార్టీల బలోపేతం కావాల్సిందేనని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 21 నుండి 25 వరకు చండీఘర్ లో సీపీఐ 25వ జాతీయ మహాసభలు జరగనున్నాయని తెలిపారు. సీపీఐ 100 ఏళ్ల ఉత్సవాలు జరుపుకుంటోందని అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలో డిసెంబర్ 26 న భారీ ప్రదర్శన చేపడతామన్నారు. డిసెంబర్ 24, 25 తేదీల్లో విజయవాడలో వివిధ దేశాల ప్రతినిధులతో అంతర్జాతీయ సెమినార్ నిర్వహిస్తామన్నారు. వామపక్షాలు ఐక్య పోరాటాలు చేసి మరింత సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. ఆపరేషన్ కగార్ పేరుతో అమాయక గిరిజనులను నక్సలైట్ల పేరిట చంపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జార్ఖండ్, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో మరణ హోమం చేస్తున్నారని మండిపడ్డారు. తమ పార్టీ పూర్వపు ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి మరణం తీవ్రంగా తనను కలసి వేసిందని, సుధాకర్ రెడ్డి స్ఫూర్తితో ఆయన ఆశయ సాధన కోసం కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు ఈ మహాసభలు వేదికగా ఈ దేశం లో రాష్ట్రంలో జరుగుతున్న ప్రమాదకర పరిస్థితులకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాల్సిన ఆవశ్యకత ఉందని స్పష్టం చేశారు. ఈ మీడియా సమావేశంలో సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ , రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు, జే వి సత్యనారాయణమూర్తి , అఖిలభారత రైతు కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య, సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి ఈశ్వరయ్య, ఆహ్వాన సంఘం కార్యదర్శి ఎంఎల్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *