జిల్లాలో యూరియా లోటు లేదనే విషయాన్ని రైతులకు అర్ధం అయ్యేలా తెలియ చేయడంతో పాటు, మోతాదుకు మించి ఎరువులు వినియోగం వలన వచ్చే అనర్థాల గూర్చి క్షేత్ర స్థాయిలో రైతులకు అవగాహన కలిగించేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.
సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ తో కలసి, రెవెన్యూ డివిజనల్ అధికారులు, నియోజక వర్గ ప్రత్యేక అధికారులు, మండల ప్రత్యేక అధికారులు ఎంపిడిఓ లు, తహసిల్దార్లు, వ్యవసాయ శాఖ అధికారులతో వర్చువల్ గా సమావేశమై యూరియా వినియోగం, సరఫరా, స్వామిత్వ, హౌసింగ్, ఉపాధి హామీ పనుల పురోగతి, వాటర్ మేనేజ్మెంట్, డాక్యుమెంట్స్ అప్ లోడింగ్, సీజనల్ డిసీజెస్ తదితర అంశాలపై సమీక్షించి దిశానిర్దేశం చేసారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…జిల్లాలో యూరియా లోటు లేదనే విషయాన్ని రైతులకు అర్ధం అయ్యేలా తెలియజేయుటకు అలాగే ఎరువుల వినియోగంపై రేపటి నుండి గ్రామ, మండల, డివిజన్, జిల్లా స్థాయిలో అవుట్ రీచ్ ప్రోగ్రాం ను నిర్వహించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమాల నిర్వహణకు గాను గ్రామ, మండల, డివిజన్ మరియు జిల్లా స్థాయిలో వ్యవసాయ శాఖ, రెవెన్యు, పోలీసు, ఉద్యాన శాఖ, ఆదర్శ రైతులతో కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ నెల 9వ తేదీన గ్రామ స్థాయిలో, 10వ తేదీన మండల స్థాయిలో, 11వ తేదీన డివిజన్ స్థాయిలో రైతులతో సమావేశాలు నిర్వహించి జిల్లాలో యూరియా లోటు లేదనే విషయాన్ని రైతులకు అర్ధం అయ్యేలా తెలియ చేయడంతో పాటు మోతాదుకు మించి ఎరువులు వినియోగం వలన వచ్చే అనర్థాల గూర్చి తెలియచేయాలని జిల్లా కలెక్టర్ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశాల్లో ప్రజా ప్రతినిధులను కూడా భాగస్వాములను చేయాలని సూచించారు. జిల్లాలో యూరియా పంపిణీ ప్రణాళిక రూపొందించాలని, దాని ప్రకారం యూరియా పంపిణీ పకడ్బందీగా అమలు చేయాలన్నారు. యూరియా కోసం జిల్లాలో ఎక్కడా పెద్ద క్యూలైన్ ఉంది అనేది రాకూడదన్నారు. యూరియా పంపిణీలో మండల అధికారులు 100 శాతం జాగ్రత్తగా, పద్ధతిగా, సీరియస్ గా పని చేయాలన్నారు. జిల్లాలో రైతులకు అవసరమైనంత యూరియా అందుబాటులో ఉందని, యూరియా సరఫరా నిరంతరం కొనసాగుతుందని, ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదనే విషయాని రైతులకు క్షేత్ర స్థాయిలో స్పష్టంగా అర్ధమయ్యేలా తెలియచేయాలని జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. రైతులకు ఎరువుల పంపిణీలో జిల్లాలో ఎక్కడా ఎటువంటి సమస్యలు లేకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఎరువుల పంపిణీలో ఎటువంటి సమస్యలు రాకుండా వ్యవసాయాధికారులు పటిష్టమైన ప్రణాళికతో పనిచేయాలన్నారు. వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో రైతులతో మాట్లాడి, మమేకమవ్వాలన్నారు. మోతాదుకు మించి ఎరువులు వినియోగం వలన వచ్చే అనర్ధాలను రైతులకు అవగాహన కలిగించాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎరువుల ధరలు, సాగు ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో, రైతులకు నానో యూరియా ఒక ప్రత్యామ్నాయంగా నిలుస్తోందన్న విషయాన్ని తెలియచేసి, నానో యూరియా వినియోగం వలన కలిగే ప్రయోజనాలను రైతులకు తెలియచేసి నానో యూరియా ను ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏడీఏలు క్షేత్రస్థాయిలో పర్యటించి ఆర్ఎస్కేల వారీగా పంట నమోదు వివరాలు సేకరించి అందులో యూరియా వేయు పంటలకు ఎంత విస్తీర్ణంలో ఎంత మోతాదులో వేయాలో రైతులకు అవగాహన కల్పించాలన్నారు. రోజువారీగా రాబోవు 30 రోజులకు యూరియా సరఫరా పై ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. యూరియా నిల్వలు ఆర్‌ఎస్‌కేకు రాకముందే ఆ గ్రామంలో ముందుగా రైతులకు సమాచారం అందించి ఎంత మోతాదు వస్తున్నది ఎంత మంది రైతులకు సరిపోతుందని తెలియజేసి ముందుగా అవసరం ఉన్న రైతులకు సక్రమంగా జరిగేలా వ్యవసాయ అధికారులు దగ్గర ఉండి పర్యవేక్షించాలన్నారు. యూరియా కృత్రిమ కొరత నివారించేందుకు అగ్రికల్చర్, కోపరేటివ్, మార్క్ ఫెడ్, పోలీస్, రెవెన్యూ అధికారులతో జాయింట్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, కమిటీ ప్రభావవంతంగా పనిచేయాలన్నారు. ప్రైవేట్ వారు ఎమ్మార్పీ కన్నా ఎక్కువకు యూరియా అమ్మితే నోటీసులు ఇవ్వాలని, ఎవరు ఎమ్మార్పీ కన్నా ఎక్కువ ధరకు అమ్మితే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఏ మండలంలో యూరియా సమస్య ఉంటే ఆ మండలానికి యూరియా అందించేలా చూడాలన్నారు. ప్రతి రోజు వ్యవసాయ శాఖ నుంచి వచ్చే డేటా ఆధారంగా ఆ రోజుకి ఎంత సరఫరా వస్తుందో, ఎంతమందికి పంపిణీ జరగబోతుందో ముందుగానే రైతులకు తెలియజేయాలని ఆదేశించారు. రాబోయే రోజుల్లో ఎంత యూరియా అవసరమవుతుందో ముందురోజే ప్రణాళిక వేసుకుని తక్షణమే ఇండెంట్ పంపించాలని, అలాగే వారానికి అవసరమయ్యే మొత్తం యూరియా డిమాండ్‌ను ముందుగానే ఇండెంట్ రూపంలో పంపాలని సూచించారు. ప్రస్తుతం స్టాక్ ఎంత ఉంది..ఆ స్టాక్ ను ఎంతమందికి సరఫరా చేయగలం అనే ప్లాన్ ముందుగానే అధికారులు రూపొందించుకోవాలన్నారు. స్టాక్, సరఫరా, నిల్వలలో ఎలాంటి తేడాలు గమనించిన వెంటనే 6 ఎ కేసులు బుక్ చేయాలని ఆదేశించారు.
రాబోయే రబీ సీజన్లో జిల్లాలో బ్లాక్ బర్లీ పొగాకు సాగు చేయకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. రాబోయే సీజన్లో జిల్లాలో బ్లాక్ బర్లీ పొగాకు సాగు చేయరాదనే విషయాన్ని క్షేత్ర స్థాయిలో రైతులకు తెలియ చేసేలా గ్రామ, మండల, డివిజన్ మరియు జిల్లా స్థాయిలో కమిటీలను కూడా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను కూడా జారీ చేయడం జరిగిందన్నారు. కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ను రైతులకు తెలియ చేయాల్సిన భాద్యత వ్యవసాయ శాఖ అధికారులపై ఉందన్నారు. జిల్లా లో 19 మండలాల్లో బ్లాక్ బర్లీ పొగాకు సాగు చేస్తున్నట్లు గుర్తించడం జరిగిందని, ఈ మండలాల్లో సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి రానున్న రబీ లో బ్లాక్ బర్లీ పొగాకు సాగు చేయకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని, రానున్న రబీ లో జిల్లా లో ఎక్కడైనా బ్లాక్ బర్లీ పొగాకు సాగు చేస్తున్నట్లు గుర్తించినట్లయితే సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ స్పష్టం చేసారు. బ్లాక్ బర్లీ పొగాకు సాగు సంబంధించి నర్సీలపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ స్వామిత్వ, హౌసింగ్, ఉపాధి హామీ పనుల పురోగతి, వాటర్ మేనేజ్మెంట్, డాక్యుమెంట్స్ అప్ లోడింగ్, సీజనల్ వ్యాధులు తదితర అంశాలపై సమీక్షించి, నిర్దేశించిన లక్ష్యాల సాధించేలా అధికారులు కృషి చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, జిల్లా పరిషత్ సిఈఓ చిరంజీవి, డ్వామా పిడి జోసెఫ్ కుమార్, డిఆర్డిఎ పిడి నారాయణ, హౌసింగ్ పిడి శ్రీనివాస ప్రసాద్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా వెంకటేశ్వర రావు, ఇరిగేషన్ ఎస్ ఈ వరలక్ష్మి, ఆర్ డబ్ల్యూఎస్ ఎస్ఈ బాల శంకర రావు తదితరులు పాల్గొన్నారు.



