నూతన బాధ్యతలు స్వీకరించిన జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు గురువారం ప్రకాశం జిల్లాలోని అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, సి.ఐలతో పోలీస్ కార్యాలయంలో గెలాక్సీ హాలులో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
జిల్లాలోని అన్ని సబ్ డివిజన్ పరిధిలో గల పరిస్థితులు, బౌగోళికల ప్రదేశాల గురించి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అంశాలు, సర్కిల్ పరిధిలో పోలీస్ స్టేషన్ లు, వారు పనిచేయుచున్న కాలపరిమితి, జిల్లా సరిహద్దు ప్రాంతాల వివరాలు మరియు కేసులు ఎక్కువగా నమోదు అయ్యే ప్రాంతాల వివరాలు గురించి సంబంధించి అధికారులతో చర్చించారు. అనంతరం జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి పోలీస్ అధికారి నిరంతరం అప్రమత్తంగా ఉండి, ప్రజలకు పారదర్శకంగా సేవలు అందిస్తూ, జవాబుదారీ తనంతో విధులు నిర్వర్తించాలన్నారు.
అదేవిధంగా అసాంఘిక కార్యకలాపాలైన పేకాట, కోడిపందాలు, మట్కా, సింగిల్ నంబర్ వంటివి జరగకుండా చర్యలు తీసుకుంటూ, ఎవరైనా వాటిని నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. చెడు నడతగల వ్యక్తులపై నిఘా వుంచాలని వారి యొక్క కదలికలను, దైనందిన జీవన విధానాన్ని, వారు చేసే పనులను పరిశీలించి, ఏవైనా అనుమానిత చర్యలు ఉంటే వెంటనే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ప్రతి ఒక్కరు సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింతగా అందిపుచ్చుకోవాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయడంతో పాటు, గంజాయి మరియు మాదకద్రవ్యాల నిర్మూలనలో సమర్థవంతంగా విధులు నిర్వహించాలని సూచించారు.
ఫిర్యాదు దారుల పట్ల మర్యాదపూర్వకంగా, మానవతా దృక్పథంతో వ్యవహరించి, చట్టపరిధిలో వారి సమస్యలను సకాలంలో పరిష్కరించాలని తెలిపారు. ఒకే సమస్య పునరావృతం కాకుండా చట్టపరిధిలో సరైన పరిష్కారాన్ని చూపించాలని, మహిళ మిస్సింగ్ కేసుల ఛేదనకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.
డయల్ 112, శక్తి కాల్ సెంటర్ కి వచ్చే ఫోన్ కాల్స్ పట్ల శ్రద్ధ వహించి, సాధ్యమైనంత త్వరగా ఆ కాల్ కి స్పందించి, పోలీస్ వారి వెంటనే స్పందించారనే భరోసాను బాధితులకు కల్పించాలన్నారు.
ప్రతి పోలీస్ స్టేషన్ లో పలు రిజిస్టర్, కేసు డైరీ మరియు ఇతర రికార్డులను సక్రమంగా నిర్వహించాలని పోలీస్ అధికారులు ఆదేశించారు. ఏదైనా కేసుకు సంబంధించి ఆధారాలను జాగ్రత్తగా భద్రపరచాలని, అదే విధంగా కేసుల దర్యాప్తు సక్రమంగా సమగ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు.
సీసీటీఎన్ఎస్ లో ఎఫ్ ఐ ఆర్ మొదలు కేసు డిస్పోజల్ వరకు ప్రతి ఒక ఫైల్స్ ను అప్లోడ్ చేయాలని సూచించారు.
తరచుగా గ్రామాలు/వార్డులను సందర్శిస్తూ విజిబుల్ పోలీసింగ్, ఓపెన్ డ్రింకింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్ డ్రైవ్ వంటి కార్యక్రమాలను నిర్వహించాలని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై చర్యలు తీసుకుని, వారికి కౌన్సిలింగ్ నిర్వహించాలన్నారు.
పోలీస్ స్టేషన్ల పరిధిలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, వాటి పనితీరును సమీక్షించాలని, డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచాలన్నారు. విధి నిర్వహణ సమయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తిన వెంటనే తన దృష్టికి తీసుకువచ్చి తగిన పరిష్కారాన్ని పొందాలన్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో, అక్కడ వైరల్ అయ్యే సమాచారం నిజనిజాల ప్రకారమే ఉండేలా చూడాలని, అలాగే పోలీస్ అధికారులు విధులు నిర్వర్తించే తీరు ప్రజల్లో నమ్మకం కలిగించేలా ఉండాలని సూచించారు.
ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) కె.నాగేశ్వరరావు, ఎఆర్ అడిషనల్ ఎస్పీ కె.శ్రీనివాసరావు, డిఎస్పిలు ఆర్.శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణ, నాగరాజు, సాయి ఈశ్వర్ యశ్వంత్, కె. శ్రీనివాసరావు, సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.



