తాళ్లూరు మండలంలో ప్రధాన వాగులు దోర్నపు వాగు, చిలకలేరులు పొంగి ప్రవహిస్తున్నారు. దీంతో పలు గ్రామాల మధ్య రాక పోకలు బంద్ అయ్యాయి. గత నాలుగు రోజులుగా 76.8 మి.మీలకు పైగా వర్షపాతం నమోదు కావటంతో గ్రామాలలో మౌళిక వసతులు లేమి ఎక్కిరిస్తున్నాయి. తోట వెంగన్న పాలెం– దోసకాయల పాడు మధ్య ప్రధాన రోడ్డు తెగి వాగు పొంగి ప్రవహిస్తున్నది. దీంతో ఆ గ్రామ సర్పంచి కోట శివలక్ష్మి వెంకట రామి రెడ్డి వాగు ప్రాంతానికి వెళ్లి వాగులో దిగి ప్రమాదకరంగా ఉందని ప్రజలను అప్రమత్తం చేసారు. ప్రతి వర్షానికి తమ రోడ్డు తెగి ఇబ్బందులు పడుతున్నామని, వాగు పై హై లేవల్ బ్రిడ్జి ఏర్పాటు చెయ్యాలని కోరుతున్నారు. కొత్త పాలెం – విఠలాపురం, తాళ్లూరు – విఠలాపురం ప్రధాన రహదారి, తాళ్లూరు – రజానగరం ప్రధాన రహదారిలలో వాగు పొంగటంతో రాక పోకలు స్తంభించాయి. లింగాలపాడు -మన్నేపల్లి మధ్య బ్రిడ్జిని అనుకుని నీరు ప్రవహిస్తున్నది. తాళ్లూరు నుండి ముండ్లమూరు వైపు వెళ్లి వాహనాలు అన్ని మన్నేపల్లి, రమణాల వారి పాలెం, విఠలాపురం మీదుగా ముండ్లమూరు వెళ్తున్నాయి. మండలంలో రబీలో సాగు చేసిన వరి 50 ఎకరాల వరకు నీట మునిగినట్లు రామభద్రాపురం రైతులు తెలిపారు.



