బేగంపేట సెప్టెంబర్ 29 (జే ఎస్ డి ఎం న్యూస్) :
సద్దుల బతుకమ్మ కు అన్ని ఏర్పాట్లను చేస్తున్నట్లు మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం ఆయన వివిధ శాఖల అధికారులతో కలిసి కర్బలా మైదానంలో ఈ నెల 30 వ తేదీన సద్దుల బతుకమ్మ ఏర్పాట్లను పరిశీలించారు. బతుకమ్మ కు వచ్చే మహిళలు ఇబ్బందులకు గురికాకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం చివరి రోజు కర్బలా మైదానంలో నిర్వహించే సద్దుల బతుకమ్మ కు వేలాది మంది మహిళలు, యువతులు వస్తారని తెలిపారు. ఇక్కడకు వచ్చే వారు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు. సాయంత్రం 6 గంటల నుండి బతుకమ్మ పాటలతో ఈ ప్రాంతం కోలాహలంగా మారుతుందని చెప్పారు. బతుకమ్మ లను ఆడే ప్రాంతంలో ప్రత్యేక లైట్లను ఏర్పాటు చేయాలని, పరిసరాలలో ఎలాంటి డ్రైనేజీ లీకేజీలు లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అదేవిధంగా బతుకమ్మలను నిమజ్జనం చేసే హుస్సేన్ సాగర్ లోని బతుకమ్మ ఘాట్ ను శుభ్రం చేయడమే కాకుండా అక్కడ కూడా ప్రత్యేక లైట్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. త్రాగునీటి బాటిల్స్ అందుబాటులో ఉండే విధంగా చూడాలని వాటర్ వర్క్స్ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా బతుకమ్మ పూర్తయ్యే వరకు ఈ మార్గంలో ట్రాఫిక్ డైవర్షన్ కు చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసు అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట డి సి డాకు నాయక్, ఈ ఈ సుబ్రమణ్యం, వాటర్ వర్క్స్ జీ ఎం వినోద్, ఆర్ అండ్ బి ఈ ఈ మోహన్, శానిటేషన్ డి ఈ వెంకట్, హార్టికల్చర్ అధికారి సతీష్, మాజీ కార్పొరేటర్ లు అత్తిలి అరుణ గౌడ్, అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, బి ఆర్ ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, గుర్రం పవన్ కుమార్ గౌడ్, నాయకులు శ్రీహరి, బాలరాజ్ యాదవ్, నాగులు లక్ష్మీపతి, శేఖర్, ప్రేమ్, కోటేశ్వర్ గౌడ్, గణేష్, అబ్బాస్ తదితరులు ఉన్నారు.



