పత్రికలకు సమాచారం ఇవ్వని అధికారులపై చర్యలు తీసుకోవాలి – కలెక్టర్ రాజబాబుకు ఫిర్యాదు చేసిన జర్నలిస్టులు.

కనిగిరి మండలంలోని పలు ప్రభుత్వ శాఖల అధికారులు మీడియాకు సమయానికి సమాచారం ఇవ్వకపోవడం పట్ల జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం పవిత్ర ఫంక్షన్ హాల్‌లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ పి. రాజబాబుకు వినతిపత్రం అందజేస్తూ, అధికారులు పత్రికలకు సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గ్రామీణ నీటి సరఫరా (ఆర్డబ్ల్యూఎస్ ) రోడ్స్ అండ్ బిల్డింగ్ ( ఆర్ అండ్ బి), ఎక్సైజ్, అటవీ, మత్స్య, ఇరిగేషన్, ఆర్డీవో, తాసిల్దార్ కార్యాలయం, మండల ప్రజా పరిషత్ కార్యాలయం, పంచాయతీరాజ్, వెలుగు, ప్రజా ఆరోగ్య–వైద్యశాఖ, హౌసింగ్, సాంఘిక సంక్షేమ సంక్షేమ, ఐసిడిఎస్ , విద్యుత్, అగ్నిమాపక, పశుసంవర్ధక, పౌర సరఫరా, పట్టణ పేదరిక నిర్మూలన (మెప్మా), కార్మిక, విద్యాశాఖ అధికారులు మీడియాకు అవసరమైన సమాచారాన్ని ఇవ్వడం లేదని జర్నలిస్టులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టం బోర్డులు కూడా లేకపోవడం విచారకరమని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజల్లో సందిగ్ధం నెలకొంటోందని, దరఖాస్తులలో తప్పిదాలు జరుగుతున్నాయని, నిజమైన లబ్ధిదారులు పథకాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు మీడియాకు సమాచారం అందిస్తే, పథకాల అమలు మరింత పారదర్శకంగా జరిగి ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరుతుందని జర్నలిస్టులు అభిప్రాయపడ్డారు.
అధికారులు సమయానికి పత్రికలకు సమాచారం అందించేలా ఆదేశాలు జారీ చేయాలని,
పథకాల అమలు, అర్హతలు, లబ్ధిదారుల వివరాలు పత్రికలకు నిరంతరంగా అందే విధానాన్ని ఏర్పాటు చేయాలని,
అవసరమైతే నెలకోసారి మీడియా బ్రీఫింగ్‌లు నిర్వహించేలా చూడాలని కలెక్టరును కోరారు.
జర్నలిస్టుల వినతిపై సానుకూలంగా స్పందించిన కలెక్టర్ పి. రాజబాబు ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపి అవసరమైనచోట్ల సంబంధిత అధికారులకు స్పష్టమైన సూచనలు ఇస్తానని హామీ ఇచ్చారు. మీడియాతో సమన్వయం మెరుగుపడేలా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *