గుండ్లకమ్మ ప్రాజెక్టు నుంచి సుమారు లక్షా 13 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల – జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు

గుండ్లకమ్మ ప్రాజెక్టు నుంచి సుమారు లక్షా 13 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు తెలిపారు. ఈ దృష్ట్యా దిగువన పరివాహక ప్రాంతంలో ఉంటున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. సంతనూతలపాడు శాసనసభ్యులు బి.ఎన్.విజయ్ కుమార్, రాష్ట్ర పొగాకు ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య చైర్మన్ జయంత్ బాబుతో కలిసి బుధవారం గుండ్లకమ్మ ప్రాజెక్టును ఆయన పరిశీలించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం, నీటిని దిగువకు విడుదల చేస్తున్న తీరు, పరివాహక ప్రాంత ప్రజలను,  రైతులను అప్రమత్తం చేసిన విధానం, ప్రాజెక్టు వద్ద సందర్శకులను నియంత్రించేందుకు చేపట్టిన భద్రత చర్యలపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. అప్పటికప్పుడే పరివాహక ప్రాంత మండలాల స్పెషల్ ఆఫీసర్లు, తహసీల్దారులతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
           ఈ సందర్భంగా కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ …గత వారం రోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షాల వలన చెరువులు పూర్తిస్థాయిలో నిండాయని, వాగులు కూడా ఉదృతంగా ప్రవహిస్తున్నాయని చెప్పారు. ఈ క్రమంలోనే ఎగువ  ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల వలన గుండ్లకమ్మ నదిలో నీటి ప్రవాహం పెరిగిందన్నారు. పైనుంచి వస్తున్న ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రాజెక్టు నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నామన్నారు. మొంథా తుఫాను వలన జిల్లాలో
ఒకటి రెండు పశువులు చనిపోయాయి తప్ప ఎలాంటి మానవ నష్టం జరగలేదని కలెక్టర్ తెలిపారు. జిల్లా యంత్రాంగం నుంచి వచ్చిన హెచ్చరికలు, సూచనలను పాటించి ప్రజలు సహకరించినందువలనే ప్రమాదం జరగలేదన్నారు. ప్రస్తుతం గుండ్లకమ్మ నుంచి దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేస్తున్నందున పరివాహక ప్రాంత ప్రజలు కూడా అధికార యంత్రాంగం చేసే సూచనలను, హెచ్చరికలను పాటించాలని ఆయన కోరారు.
శాసనసభ్యులు విజయకుమార్ మాట్లాడుతూ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేస్తున్నందున క్షేత్రస్థాయిలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందీ కలగకుండా అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలపై ఉన్నతాధికారులతో చర్చించామన్నారు. గ్రామస్థాయిలో వీఆర్వోల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించి అప్రమత్తం చేసినట్లు తెలిపారు. మరో రెండు రోజులపాటు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఆయన సూచించారు.
ఈ సమీక్ష సమావేశంలో ప్రాజెక్టు ఎస్.ఈ. అబూత్ అలీమ్, ఒంగోలు ఆర్డీవో లక్ష్మీ ప్రసన్న, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విజయజ్యోతి, మండల స్పెషల్ ఆఫీసర్ అయిన మార్కెటింగ్ ఏ.డీ. వరలక్ష్మి, ఎంపీడీవో జ్యోతి, తహసిల్దార్ ఆదిలక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe
Back to list

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *