హైదరాబాద్, ఫిబ్రవరి 8,(జే ఎస్ డి ఎం న్యూస్ ) :
నగర రహదారులపై భద్రతను పటిష్టం చేసేందుకు, రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో (Special Drive) భారీ సంఖ్యలో మందు బాబులు పట్టుబడ్డారు. ఫిబ్రవరి 06 మరియు 07 తేదీల్లో నగరవ్యాప్తంగా నిర్వహించిన ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మొత్తం 604 మంది వాహనదారులపై కేసులు నమోదు చేసినట్లు ట్రాఫిక్ జాయింట్ పోలీస్ కమిషనర్ డి. జోయల్ డేవిస్ ఒక ప్రకటనలో తెలిపారు.
మొత్తం 604 మంది వాహన దారులు పట్టు బడగా వారిలో ద్విచక్ర వాహనదారులు 492 మంది,త్రీ-వీలర్ (ఆటోలు) 42,ఫోర్-వీలర్ మరియు ఇతర వాహనాలు 70 ఉన్నాయన్నారు.
మద్యం మోతాదు (BAC Levels) వివరాలు:
తనిఖీల్లో పట్టుబడిన వారిలో మద్యం మోతాదు స్థాయిలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
• 30-50 mg: 141 కేసులు
• 51-100 mg: 238 కేసులు
• 101-150 mg: 127 కేసులు
• 151-200 mg: 61 కేసులు
• 201-250 mg: 25 కేసులు
• 251-300 mg: 07 కేసులు
• 300 mg పైబడి: 05 కేసులు
మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల తమ ప్రాణాలకే కాకుండా ఇతర అమాయక పాదచారుల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతుందని జాయింట్ కమిషనర్ పేర్కొన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ ఉల్లంఘనల పట్ల తాము ‘జీరో టాలరెన్స్’ (సహించే ప్రసక్తే లేదు) విధానాన్ని అనుసరిస్తున్నామని, ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ పోలీసులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.