హైదరాబాద్, ఫిబ్రవరి 15,
(జే ఎస్ డి ఎం న్యూస్ ) :
సౌదీ అరేబియాలోని అల్-ఖాసిం వేదికగా జరిగిన ఏషియన్ రోడ్ పారా-సైక్లింగ్ ఛాంపియన్‌షిప్-2026లో భారత జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది. హైదరాబాద్ ఆదిత్య మెహతా ఫౌండేషన్‌లో శిక్షణ పొందిన 16 ఏళ్ల గుజరాత్ కి చెందిన విశ్వ వసాని ‘ఇండివిజువల్ టైమ్ ట్రయల్’, ‘రోడ్ రేస్’ విభాగాల్లో రెండు రజత పతకాలు కైవసం చేసుకుంది. తొమ్మిది దేశాల క్రీడాకారులు తలపడిన ఈ టోర్నీలో భారత్ నుంచి పలువురు క్రీడాకారులు టాప్-5లో నిలిచారు. ప్రశాంత్ అర్కాల్ (హ్యాండ్ సైక్లింగ్ హెచ్4) 4వ స్థానం, షేక్ అర్షద్ (ఎంసీ2) 4వ స్థానం, కొమ్మోజి పవన్ కుమార్ (ఎంసీ3) 5వ స్థానం, అన్షుమన్ (ఎంసీ1, 14 ఏళ్లు) 5వ స్థానం, చీలంపల్లి ఆర్యవర్ధన్ (ఎంసీ2) 6వ స్థానం, యోగేష్ అహిరే (హ్యాండ్ సైక్లింగ్ హెచ్3) 7వ స్థానం. ఆసియాలో అత్యుత్తమ క్రీడాకారులతో పోటీ పడుతూ భారత జట్టు తమ పట్టుదలను,
క్రమశిక్షణను, అంతర్జాతీయ స్థాయి సన్నద్ధతను ప్రదర్శించింది. ఈ పారా సైక్లింగ్ ఏషియన్ ఛాంపియన్‌షిప్‌లో మొత్తం 9 దేశాలు పాల్గొన్నాయి.
ఈ సందర్భంగా ఆదిత్య మెహతా మాట్లాడుతూ తమకు అండగా నిలిచిన ఇన్వెస్కో, ఆల్కాన్, జీఎంఎంసీఓ, ఫ్లట్టర్ ఎంటర్టైన్మెంట్ ఇండియా (వయోజన పారా సైక్లిస్టులకు మద్దతుగా) సంస్థలకు కృతజ్ఞతలు తెలిపింది. ఆత్మవిశ్వాసంతో భారత పారా సైక్లింగ్ జట్టు స్వదేశానికి తిరిగి వస్తోంది. పట్టుదల, సరైన సన్నద్ధత, సంకల్పం ఉంటే విజయం దక్కుతుందని ఈ జట్టు మరోసారి నిరూపించింది.

