బేగంపేట ఫిబ్రవరి 18,
(జే ఎస్ డి ఎం న్యూస్) :
తలసాని ట్రస్టు ద్వారా ప్రత్యేక విద్యార్థులకు పుస్తకాలను అందజేస్తామని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బేగంపేట బ్రాహ్మణవాడి శ్రీ స్వామి రామానంద తీర్థం మెమోరియల్ ను ఎమ్మెల్యే తలసాని, ఎమ్మెల్సీ వాణిదేవి, బేగంపేట తాజా మాజీ కార్పొరేటర్ టి.మహేశ్వరి శ్రీహరి లతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బేగంపేట లోని బ్రాహ్మణ వాడి స్వామి రామానంద తీర్ధ మెమోరియల్ లో చదువుతున్న విద్యార్థులకు అన్ని పాఠ్యపుస్తకాలను ప్రతి సంవత్సరం తలసాని ట్రస్ట్ ద్వారా అందజేస్తామని ప్రకటించారు. విద్యార్థులతో ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్ ను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్సీ సురభి వాణిదేవి తో కలిసి ప్రారంభించారు. ముందుగా మాజీ ప్రధాని పి.వీ. నర్సింహ రావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం విద్యార్థులు రూపొందించిన వివిధ రకాల ప్రదర్శనలను పరిశీలించి విద్యార్థులను అభినందించారు.స్వామి రామానంద తీర్ధ శిష్యులు, భారతరత్న మాజీ ప్రధాని పి.వీ నర్సింహ రావు ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ ట్రస్ట్ ద్వారా అనేకమంది పేద విద్యార్థులకు విద్యాబోధన చేస్తూ అనేకమందిని ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దారని ప్రశంసించారు.పి.వి.మరణానంతరం ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి తండ్రి ఆశయాలు, లక్ష్య సాధన కోసం కృషి చేస్తున్నారని చెప్పారు. పేద విద్యార్థులకు ఎంతగానో సేవలు అందిస్తున్న స్వామి రామానంద తీర్ధ మెమోరియల్ అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని ప్రకటించారు. ప్రస్తుతం నర్సరీ నుండి 7 వ తరగతి వరకు ఉన్న మెమోరియల్ ను 10 వ తరగతి వరకు అప్ గ్రేడ్ కు కృషి చేస్తానని, అవసరమైతే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించడంతో పాటు అవసరమైన క్రీడాసామాగ్రి, ఫర్నిచర్ ను కూడా తలసాని ట్రస్ట్ ద్వారా అందజేస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో ట్రస్ట్ సెక్రెటరీ, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, మెమోరియల్ ప్రిన్సిపాల్ వాసుకి, మేనేజర్ అరుణ శ్రీ, మాజీ కార్పొరేటర్ టి.మహేశ్వరి, నాయకులు శ్రీహరి, నరేందర్, శ్రీనివాస్ గౌడ్, శేఖర్, ఆరీఫ్, మోహిన్, శ్యామ్, భరత్, నాని, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.



