వైద్యురాలిగా నటిస్తూ రోగులను మత్తులో ముంచి దోచుకుంటున్న కిలేడి -భర్తతో కలిసి అరెస్ట్

హైదరాబాద్, మార్చి 17,(జే ఎస్ డి ఎం న్యూస్) :

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఆసుపత్రుల్లో వైద్య నిపుణురాలిగా నటిస్తూ రోగులకు మత్తుమందు ఇచ్చి వారి బంగారు ఆభరణాలు దోచుకుంటున్న మహిళను, ఆమెకు సహకరిస్తున్న భర్తను సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్, మార్కెట్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు.
నిందితురాలు గౌండ్ల శిరీష (25) ఫార్మ్-డి విద్యార్థిని. ఆర్థిక ఇబ్బందుల కారణంగా సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో తన భర్త ఎడులపల్లి సాయి కుమార్ గౌడ్ (30)తో కలిసి ఈ దోపిడీలకు పాల్పడింది.
శిరీష డాక్టర్ వేషంలో ఆసుపత్రుల్లోకి ప్రవేశించి, ముఖ్యంగా వృద్ధ మహిళా రోగులను లక్ష్యంగా చేసుకునేది. తన వెంట తెచ్చుకున్న ‘డయాజెపామ్’ మత్తు ఇంజక్షన్‌ను వారికి ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేసి, అనంతరం వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలను అపహరించి పరారయ్యేది.
మార్చి 11న సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రి, అలాగే చందానగర్‌లోని సిటిజన్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఇదే విధంగా చోరీలకు పాల్పడ్డారు. దొంగిలించిన సొమ్మును విలాసాలకు, షాపింగ్‌కు వినియోగించేవారు.
పోలీసులు నిందితుల వద్ద నుంచి సుమారు 11 తులాల బంగారు ఆభరణాలు, ఒక మారుతీ సుజుకీ బాలెనో కారు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
మార్కెట్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నెం.70/2026, చందానగర్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నెం.274/2026 కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ జె. రాజశేఖర్ నేతృత్వంలోని బృందం నిందితులను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *