పెట్టుబడులతో రండి..! – జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధిపై కలెక్టర్ మరింత దృష్టి -వచ్చేనెలలో పారిశ్రామికవేత్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహణ

జిల్లాలో పారిశ్రామిక ప్రగతిని మరింత ముందుకు తీసుకువెళ్లడంపై కలెక్టర్ పి.రాజాబాబు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ దిశగా పెట్టుబడిదారులతో ప్రత్యేకముగా వచ్చే నెలలో సమావేశం నిర్వహించనున్నారు. జిల్లాలో పారిశ్రామిక పురోగతిపై శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నంలో జరిగిన పెట్టుబడిదారుల సదస్సులో కుదిరిన ఒప్పందం మేరకు జిల్లాలో 10 పరిశ్రమలను స్థాపించేందుకు ముందుకు వచ్చిన పెట్టుబడిదారుల కోసం తీసుకుంటున్న చర్యలు, రాష్ట్రస్థాయి పెట్టుబడిదారుల బోర్డు సమావేశంలో జిల్లాలో మూడు పరిశ్రమలు పెట్టేందుకు ఆసక్తి చూపించిన
పారిశ్రామికవేత్తల కోసం తీసుకుంటున్న చర్యలు, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేసేందుకు తీసుకుంటున్న చర్యల పురోగతిపై ఈ సమావేశంలో కలెక్టర్ సమీక్షించారు. వీటితోపాటు జిల్లాలో విస్తారంగా ఉన్న భూములను పారిశ్రామిక అభివృద్ధి కోసం ఉపయోగించేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. పారిశ్రామిక భూముల విషయంలో రెవెన్యూ సమస్యలను త్వరగా పరిష్కరిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఏపీఐఐసీ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన పారిశ్రామిక ప్లాట్ల గురించి పెట్టుబడుదారులకు, పారిశ్రామిక సంఘాలకు చెప్పాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలు, అందుబాటులో ఉన్న వనరులు, ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహాల గురించి వారికి వివరించేలా వచ్చే నెలలో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తానని చెప్పారు. ఈ దిశగా ఇప్పటినుంచే దృష్టి సారించాలని అధికారులకు ఆయన స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ మదన్, నెడ్ క్యాప్ అధికారులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *