జిల్లా ప్రజల నుంచి వచ్చే వివిధ రకాల ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం అందించాలనే ఉద్దేశంతో సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ మరియు పోలీస్ అధికారులు ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం (మీకోసం)ను నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జిల్లాలోని నలుదిక్కులా నుండి వచ్చిన ఫిర్యాదిదారులు స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ సమస్యలకు సంబంధించిన వ్రాతపూర్వక అర్జీలను జిల్లా ఎస్పీ గారికి మరియు పోలీస్ అధికారులకు సమర్పించి, వారియొక్క సమస్యలను వివరించారు. పోలీస్ అధికారులు ఫిర్యాదుదారులతో ముఖాముఖీగా మాట్లాడి, వారి ఫిర్యాదుల వివరాలను తెలుసుకొని, వాటిని చట్టపరంగా త్వరితగతిన పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.
అందిన ఫిర్యాదులపై జిల్లా ఎస్పీ సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి, ప్రతి ఫిర్యాదుపై తక్షణ విచారణ చేపట్టి, చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం అందించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. “మీకోసం” కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదుల విషయంలో ఎలాంటి అలసత్వం చూపకుండా, నిర్ణీత గడువులోనే పరిష్కారం అందించాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు.
ఫిర్యాదు చేసేందుకు వచ్చే వృద్ధులు, నడవలేని పరిస్థితిలో ఉన్నవారి సమస్యలను ప్రత్యేక దృష్టిలో ఉంచుకొని, అవసరమైతే సంఘటన స్థలాలను సందర్శించి, చట్టప్రకారం సత్వర న్యాయం అందించాలని జిల్లా ఎస్పీ పోలీస్ అధికారులకు సూచించారు.
అలాగే జిల్లా పోలీస్ కార్యాలయానికి రాలేని ప్రజలు తమ ఫిర్యాదులను సమీపంలోని పోలీస్ స్టేషన్లు, సర్కిల్ కార్యాలయాలు, సబ్-డివిజన్ కార్యాలయాల్లో కూడా అందజేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా సివిల్, భూ, ఆర్థిక తగాదాలు, చీటింగ్ కేసులు, అత్తరింటి వేదింపులు తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయి.
ఈ కార్యక్రమంలో మహిళ పోలీస్ స్టేషన్ డిఎస్పీ వి.వి.రమణ కుమార్, ఒంగోలు రూరల్ సీఐ శేషగిరి రావు, కొండెపి సీఐ సోమశేఖర్, సంతమాగులూరు సీఐ వెంకటరావు, ప్యానెల్ అడ్వొకేట్ బి.బాలాజీ సింగ్, సమస్యల పరిష్కార వేదిక ఎస్సై జనార్దన్ రావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
