హైదరాబాద్ మార్చి 31
(జే ఎస్ డి ఎం న్యూస్) :
మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో మంగళవారం నిర్వహించిన 211వ సీఎం ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 405 దరఖాస్తులు అందాయి. వాటిలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 160 దరఖాస్తులు, రెవెన్యూ శాఖకు సంబంధించి 53, ఇందిరమ్మ ఇండ్ల కోసం 114, ప్రవాసి ప్రజావాణికి 01 దరఖాస్తులు వచ్చాయి. ఇతర శాఖలకు సంబంధించి 77 దరఖాస్తులు అందాయి.సీఎం ప్రజావాణి ఇంచార్జ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి దరఖాస్తులు స్వీకరించి ప్రజల సమస్యలు విని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి పలు సమస్యలను పరిష్కరించారు.
రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సీఎం ప్రజావాణిని సందర్శించారు. అన్ని డెస్క్ లను పరిశీలించి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రవాసి ప్రజావాణి పని తీరును కూడా పరిశీలించారు. సీఎం ప్రజావాణి అమలుపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంచార్జ్ చిన్నారెడ్డితో చర్చించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి సీఎం ప్రజావాణి కేంద్ర బిందువుగా నిలిచిందని, సీఎం ప్రజావాణి పట్ల ప్రజల్లో విశ్వాసం పెరిగిందని చిన్నారెడ్డి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్, అదనపు కలెక్టర్ సూర్య ప్రకాష్, ఏ.సీ.పీ. ఉమేందర్,ఎన్.ఆర్.ఐ. సలహా మండలి వైస్ చైర్మన్ మంద భీం రెడ్డి, ప్రవాసి ప్రజావాణి సమన్వయకర్త బొజ్జా అమరేందర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
