గుంటి గంగా భవాని తిరునాళ్ల ను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని దర్శి సీఐ రామారావు కోరారు. గుంటి గంగా భవాని తిరునాళ్లు వచ్చే నెల మూడవ తేదీన నిర్వహిస్తున్న నేపధ్యంలో సమన్వయ కమిటీ సమావేశం ఈఓ నారాయణ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శి సీఐ రామా రావు మాట్లాడుతూ గత సంవత్సరం ఏర్పాటు చేసిన ప్రభల వలన తీవ్ర ఇబ్బందులు పడ్డారని ప్రస్తుతం ఒక ప్రణాళిక ప్రకారం రోడ్డు దూరంగా ప్రజలను ఏర్పాటు చేసేందుకు నిర్వాహకులు సహకరించాలని కోరారు. గంగవరం రోడ్డుకు 500 మీటర్లు దాటిన తర్వాత, చీమకుర్తి రోడ్డుకు 300 మీటర్లు దూరంగా మెయిన్ రోడ్డుకు లోపల వైపున ప్రభలను నిర్వాహకులు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఈఓ నారాయణ రెడ్డి మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన క్యూ లైన్స్ ఏర్పాటు చేసి ప్రశాంతంగా దర్శనం జరిగే విధంగా చూస్తామని చెప్పారు. తహసీల్దార్ రమణా రావు, ఎంపీడీఓ అజిత, ఎస్సై మల్లిఖార్జున రావు, తూర్పుగంగవరం పీహెచ్సీ వైద్యులు డాక్టర్ శ్రీకాంత్ తమ శాఖల పరిధిలో తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. ప్రభల నిర్వాహకులు క్రమశిక్షణతో వ్యవహరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖకు సహకరించాలని ఎస్సై మల్లిఖార్జున రావు కోరారు. టిడిపి పార్టీ అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్డి, వైసీపీ పార్టీ అధ్యక్షుడు టివీ సుబ్బా రెడ్డి, పలువురు నాయకులు, ప్రభల నిర్వాహక కమిటీ బాధ్యులు పాల్గొన్నారు.

