డా.బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ క్యాంపు కార్యాలయంలో ఆదివారం జిల్లా ఎస్పీ మరియు పోలీస్ అధికారులు ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ బాబూ జగ్జీవన్ రామ్ భారత స్వాతంత్య్ర సమరయోధుడిగా, సామాజిక సమానత్వం కోసం నిరంతరం కృషి చేసిన ఆదర్శనేతగా నిలిచారని, గొప్ప నాయకుడిగా ప్రజల మనసుల్లో చిరస్మరణీయుడిగా నిలిచారని తెలిపారు. పిన్న వయసులోనే భారత పార్లమెంటులో ప్రవేశించి, సుదీర్ఘకాలం మంత్రిగా సేవలందించడంతో పాటు ఉప ప్రధానిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారని పేర్కొన్నారు. అట్టడుగు మరియు అణగారిన వర్గాల అభివృద్ధి కోసం ఆయన చేసిన పోరాటం అపూర్వమని, సమాన హక్కుల సాధనలో ఆయన పాత్ర ఎంతో కీలకమన్నారు. భారత రాజ్యాంగంలో సామాజిక న్యాయం అంశాన్ని పొందుపరచడంలో ప్రముఖ పాత్ర పోషించారని, కార్మికుల హక్కులు, వ్యవసాయ రంగ అభివృద్ధి, విద్యా విస్తరణ కోసం అనేక సంస్కరణలు చేపట్టారన్నారు. మంచి ప్రజానాయకుడిగా, రాజనీతిజ్ఞుడిగా, పరిపాలనాదక్షుడిగా ప్రజలచేత ఆప్యాయంగా “బాబూజీ” అని పిలిపించుకున్నారని, అలాంటి మహనీయుని ఆదర్శాలను అనుసరించి సమసమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ సీతారామిరెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు.
