జిల్లాలో భూగర్భ నీటిమట్టం పెంచడంతో పాటు సమర్థంగా నీటి వనరుల నిర్వహణకు అవసరమైన చర్యలు చేపట్టామని కలెక్టర్ పి.రాజాబాబు చెప్పారు. ‘ జల ధార – జల హారతి ‘ కార్యక్రమం నిర్వహణ అనంతరం అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ ఇందులో పాల్గొన్నారు. భూగర్భ నీటిమట్టం పెంచటం, వాన నీటిని ఒడిసి పట్టడం, వినూత్న ఆలోచనలతో జిల్లాను సస్యశ్యామలం చేయటంపై పలు జిల్లాల కలెక్టర్లు తమ ప్రణాళికలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ మొంథా తుఫాను సమయంలోనే జిల్లాలోని చెరువులన్నీ పూర్తిగా నిండాయన్నారు. మరోవైపు నిండిన చెరువులలోని నీటిని సమీపంలోని నీటి వనరులకు మళ్లించేలా అవసరమైన ప్రణాళికలను అప్పట్లోనే రూపొందించామన్నారు. ఈ దిశగా పనులను పూర్తి చేసి జిల్లాలో నీటి ఎద్దడి లేకుండా దృష్టి సారించామని చెప్పారు. జిల్లాలోని పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని ‘ జల సురక్ష మిషన్ ‘ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. భూగర్భ నీటి నిల్వలో గణనీయ పురోగతి సాధిస్తామని చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఇరిగేషన్ ఎస్.ఈ.వరలక్ష్మి, ఈ.ఈ. శివరామ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
